YouVersion Logo
Search Icon

మార్కు 11

11
యేసును రాజుగా ప్రదర్శించడం
జెక 9:9; మత్తయి 21:1-9; లూకా 19:29-38; యోహా 12:12-19
1వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు. 2“మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకూ దాని మీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. 3అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు.”
4శిష్యులు వెళ్ళి, ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి, దాన్ని విప్పుతుండగా 5అక్కడ ఉన్న కొందరు వారితో, “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని అడిగారు. 6శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు. 7వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకు వచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. 8చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు.
9ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు! 10రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అని బిగ్గరగా కేకలు వేశారు.
11యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు.
వాడిపోయిన అంజూరు చెట్టు
మత్తయి 21:19-21
12మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 13కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14ఆయన ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు.
యేసు దేవాలయాన్ని శుద్ధి చేయడం
మత్తయి 21:12-16; లూకా 19:45-47; యోహా 2:13-16
15వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి, వ్యాపారం చేస్తున్నవారిని తరిమి వేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు. 16దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోకుండా చేశాడు. 17ఆయన వారికి బోధిస్తూ,
“‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’
అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు.
18ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు గానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు. 19సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు. 20తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు. 21అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అన్నాడు.
విశ్వాస సహిత ప్రార్థన
యాకో 5:15
22అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి. 23మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. 24అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. 25అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి. 26అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”
యేసు అధికారాన్ని గురించి ప్రశ్న
మత్తయి 21:23-27; లూకా 20:1-8
27యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి 28ఆయనతో, “నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” అని అడిగారు.
29యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను. 30యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు. 31వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. “‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు. 32‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు. 33కనుక వారు, “మాకు తెలియదు” అని జవాబు చెప్పారు. యేసు, “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy