YouVersion Logo
Search Icon

మత్తయి 18

18
చిన్న పిల్లల ఆదర్శం
మార్కు 9:33-37; లూకా 9:46-48
1ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, “పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?” అని యేసుని అడిగారు. 2అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు, 3“మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 4కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.
5 5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే. 6కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
7 “నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు. 8నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది. 9నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.
10 10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు.
పోయిన గొర్రె
లూకా 15:3-7
11 “మీరేమంటారు? ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి, 12మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్తాడు గదా? 13అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 14అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు.
15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. 16అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. 17అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.
18 “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. 19ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.
స్థానిక సంఘం మౌలిక రూపం
20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”
క్షమ సిద్ధాంతం
లూకా 17:3, 4
21అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. 22అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను. 23కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.
24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. 25ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. 26అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 27ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు.
28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. 29అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 30కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు.
31 “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. 32అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! 33నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి 34అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.
35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in