YouVersion Logo
Search Icon

మలాకీ 3

3
1సైన్యాలకు అధిపతియైన యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నా దూతను పంపుతున్నాను. అతడు నాకు ముందుగా దారి సిద్ధం చేస్తాడు. ఆ తరువాత మీరు వెతుకుతూ ఉన్న ఆ ప్రభువు, అంటే మీరు కోరుకున్న నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు. ఆయన వస్తున్నాడు.
2ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలడు? ఆయన కనబడినప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి కొలిమిలో ఉండే నిప్పులాంటివాడు, చాకలి చేతిలోని సబ్బు వంటివాడు. 3ఆయన వెండిని పరీక్షించి పుటం పెట్టి శుద్ధి చేసేవాడిలాగా కూర్చుంటాడు. వెండి బంగారాలను శుద్ధి చేసి పుటంపెట్టే విధంగా ఆయన లేవీ గోత్రం వారిని శుద్ధి చేస్తాడు. అప్పుడు వాళ్ళు నీతి నియమాలను అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు.
4గతించిన రోజుల్లో, పూర్వకాలంలో ఉన్నట్టుగా, యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు అర్పించే నైవేద్యాలు యెహోవాకు ప్రీతికరంగా ఉంటాయి. 5తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.
నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టిన వారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
దేవుని సొత్తు దొంగతనం
6యెహోవానైన నేను మార్పు చెందను గనుక యాకోబు సంతతివారైన మీరు నాశనం కారు.
7మీ పూర్వీకుల కాలం నుండి మీరు నా నియమాలను లక్ష్యపెట్టకుండా వాటిని తిరస్కరించారు. అయితే ఇప్పుడు మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీవైపు తిరుగుతానని సైన్యాల అధిపతియైన యెహోవా చెప్పినప్పుడు, ‘మేము దేని విషయంలో తిరగాలి?’ అని మీరు అంటారు. 8మానవుడు దేవుని సొత్తు దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా సొత్తు దొంగిలించారు. ‘ఏ విషయంలో మేము నీదగ్గర దొంగిలించాం?’ అని మీరు అంటారు. దశమ భాగం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వకుండా దొంగిలించారు.
9ఈ ప్రజలందరూ నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. మీరు శాపానికి పాత్రులయ్యారు. 10నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
11“మీ పంటను పురుగులు తినివేయకుండా నేను గద్దిస్తాను. అవి మీ భూమిపై ఉన్న పంటను నాశనం చెయ్యవు. మీ ద్రాక్షచెట్ల ఫలాలు అకాలంలో రాలిపోవు. ఇది సైన్యాలకు అధిపతియైన యెహోవా వాక్కు. 12ఇక అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. అన్య దేశాల ప్రజలంతా మిమ్మల్ని ధన్య జీవులు అంటారు అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. 13యెహోవా చెప్పేదేమిటంటే, నాకు విరోధంగా మీరు చాలా గర్వంగా మాట్లాడారు. ‘నిన్ను గూర్చి ఏమని మాట్లాడాం?’ అని మీరు అడుగుతారు.
14మీరు ఇలా చెప్పుకుంటున్నారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్ధం. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యాల అధిపతియైన యెహోవా సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంవల్ల ఏమి ఉపయోగం? 15గర్విష్ఠులే ధన్యతలు పొందుతున్నారు, యెహోవాను శోధించే దుర్మార్గులు భద్రంగా ఉంటూ వర్ధిల్లుతున్నారు.’”
16అప్పుడు, యెహోవా పట్ల భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా ఆ మాటలు విన్నాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గౌరవించే వారి గురించి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధానంలో ఒక పుస్తకం రాశారు. 17“నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
18అప్పుడు నీతిమంతులెవరో దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించేవాళ్ళు ఎవరో, సేవించనివాళ్ళు ఎవరో మీరు మళ్ళీ గుర్తిస్తారు.

Currently Selected:

మలాకీ 3: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy