YouVersion Logo
Search Icon

హోషే 4

4
ఇశ్రాయేలీయులు దుర్నీతి
1ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.
సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి.
యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.
2అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.
హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది.
ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.
3కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది.
దాని పశువులు, పక్షులు, దానిలో నివసించే వాళ్ళంతా క్షీణించి పోతున్నారు.
సముద్రంలో చేపలు సైతం గతించిపోతున్నాయి.
4ఒకడు మరొకడిపై వ్యాజ్యం వెయ్యనివ్వవద్దు.
ఒకడు మరొకడిపై నింద వెయ్యనివ్వవద్దు.
ఎందుకంటే యాజకులారా, నేను తప్పు పట్టేది మిమ్మల్నే.
5యాజకులు పగటి వేళ కూలిపోతారు. రాత్రివేళ నీతోబాటు ప్రవక్తలు పడిపోతారు.
నీ తల్లిని నేను నాశనం చేస్తాను.
6నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు.
నాకు యాజకుడివి కాకుండా నేను కూడా నిన్ను తోసిపుచ్చుతాను.
ఎందుకంటే నీవు నీ దేవుడినైన నా చట్టాన్ని విస్మరించావు. నీ పిల్లలను కూడా నేను పట్టించుకోను.
7యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు.
కాబట్టి వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను.
8నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు.
9కాబట్టి జనులకు ఎలాగో యాజకులకూ అలాగే జరుగుతుంది.
వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తాను.
వారి క్రియలనుబట్టి వారందరికీ ప్రతీకారం చేస్తాను.
10వారు నాకు, అంటే యెహోవాకు దూరమయ్యారు. నన్ను విడిచిపోయారు.
కాబట్టి వారు భోజనం చేసినా తృప్తి పొందరు.
వ్యభిచారం చేస్తారు గానీ అభివృద్ధి పొందలేరు.
11లైంగిక విచ్చలవిడితనం, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షా రసం, వారి మతి పోగొట్టాయి.
12నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్క బొమ్మల దగ్గర విచారణ చేస్తారు.
వారి చేతికర్ర వారికి ప్రవచనాలు చెబుతున్నది.
వ్యభిచార మనస్సు వారిని దారి తప్పించగా వారు నన్ను, అంటే వారి దేవుణ్ణి విసర్జించారు.
13వారు పర్వత శిఖరాల మీద బలులర్పిస్తారు.
కొండలపై ధూపం వేస్తారు.
సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద,
మస్తకి వృక్షాల కింద నీడ మంచిదని అక్కడే ధూపం వేస్తారు.
అందువలనే మీ కూతుర్లు వేశ్యలయ్యారు. మీ కోడళ్ళు కూడా వ్యభిచారిణులయ్యారు.
14మీ కుమార్తెలు చేసే లైంగిక దుర్మార్గతను బట్టి నేను వారిని శిక్షించను.
మీ కోడళ్ళ వ్యభిచారాన్ని బట్టి నేను వారిని శిక్షించను.
ఎందుకంటే ప్రజలు తామే వేశ్యల దగ్గరికి పోతారు.
తామే ఆలయ వేశ్యలతో పోకిరీ పనులు చెయ్యడం కోసం బలులర్పిస్తారు.
అవగాహన లేని జనం నిర్మూలమైపోతారు.
15ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైపోయావు.
అయినా యూదా ఆ పాపంలో పాలు పొందక పోవుగాక.
మీరు గిల్గాలు వెళ్లొద్దు. బేతావెనుకు పోవద్దు.
యెహోవా జీవం తోడని ప్రమాణం చేయవద్దు.
16పొగరుబోతు పెయ్యలాగా ఇశ్రాయేలువారు మొండిగా ప్రవర్తించారు.
మైదానంలో మేసే గొర్రె పిల్లలను నడిపించినట్టు దేవుడు వారినెలా నడిపిస్తాడు?
17ఎఫ్రాయిము విగ్రహాలతో ఏకమయ్యాడు.
అతణ్ణి అలానే ఉండనియ్యి.
18వారికి ద్రాక్షారసం లేకుండా పోయినా,
వ్యభిచారం మానుకోలేదు.
వారి అధికారులు ఎంతో ఇష్టంగా సిగ్గుమాలిన దాన్ని ప్రేమిస్తారు.
19సుడిగాలి వారిని చుట్టబెట్టుకు పోతుంది.
తాము అర్పించిన బలుల కారణంగా వారు సిగ్గుపడతారు.

Currently Selected:

హోషే 4: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in