YouVersion Logo
Search Icon

ఆమోసు 5

5
విలాప వాక్కులు, పశ్చాత్తాపానికి పిలుపు
1ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి.
2ఇశ్రాయేలు కన్య కూలిపోయింది.
ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు.
లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.
3యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,
“ఇశ్రాయేలు వారిలో ఒక పట్టణం నుంచి వెయ్యి మంది బయలుదేరితే వంద మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.
వంద మంది బయలుదేరితే పది మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.”
4ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు,
“నన్ను వెతికి జీవించండి.
5బేతేలును ఆశ్రయించవద్దు.
గిల్గాలులో అడుగు పెట్టవద్దు.
బెయేర్షెబాకు పోవద్దు.
గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు.
బేతేలుకు ఇక దుఖమే.”
6యెహోవాను ఆశ్రయించి జీవించండి.
లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు.
అది దహించి వేస్తుంది.
బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు.
7వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి,
నీతిని నేలపాలు చేస్తున్నారు.
8ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు.
చీకటిని తెలవారేలా చేసేవాడు.
పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు.
సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి
భూమి మీద కుమ్మరిస్తాడు.
9ఆయన పేరు యెహోవా.
బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా
నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.
10పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని
వాళ్ళు అసహ్యించుకుంటారు.
యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు.
11మీరు పేదలను అణగదొక్కుతూ
ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు,
కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా
వాటిలో నివసించరు.
మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా
ఆ ద్రాక్ష మద్యం తాగరు.
12మీ నేరాలెన్నో నాకు తెలుసు.
మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు.
మీరు లంచాలు తీసుకుని
తప్పుచేయని వారిని బాధిస్తారు.
ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.
13అది గడ్డుకాలం గనక
ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు.
14మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి.
అలా చేస్తే మీరనుకున్నట్టు
యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు
తప్పకుండా మీతో ఉంటాడు.
15చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి.
పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి.
ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు
యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.
16అందుచేత యెహోవా ప్రభువు,
సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే,
“ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది.
ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు.
ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు.
దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు.
17ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది.
ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.”
యెహోవా తీర్పు దినం
18యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు
ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు?
అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది.
19ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే
ఎలుగుబంటి ఎదురు పడినట్టు,
లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే
పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.
20యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా?
కాంతితో కాక చీకటిగా ఉండదా?
21మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు.
మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.
22నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా
నేను వాటిని అంగీకరించను.
సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.
23మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి.
మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.
24నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి.
నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.
25ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు
మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా?
26మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు.
సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు.
27కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి
మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను,
అని యెహోవా చెబుతున్నాడు.
ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.

Currently Selected:

ఆమోసు 5: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in