అపొస్తలుల కార్యములు 13
13
పౌలు బర్నబాలకు పరిశుద్ధాత్మ పిలుపు
1అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.
2వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. 3విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.
పౌలు మొదటి సువార్త ప్రయాణం
4కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు. 5వారు సలమీ అనే ఊరికి చేరుకుని యూదుల సమాజ మందిరాల్లో దేవుని వాక్కు ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.
6వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అనే ఒకణ్ణి చూశారు. 7ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్కు వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు.
8అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. 9అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి 10అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? 11ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు. 12అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
13తరువాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫులియా లోని పెర్గ కు వచ్చారు. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్ళిపోయాడు.
పిసిదియ అంతియొకయ సమాజ మందిరంలో పౌలు ఉపదేశం: విశ్వాసం ద్వారానే నిర్దోషత్వం
14అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోని అంతియొకయ వచ్చి విశ్రాంతిదినాన సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు. 15ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, “సోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా ప్రోత్సాహ వాక్కు చెప్పాలంటే చెప్పండి” అని అడిగారు. 16అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు,
17“ఇశ్రాయేలీయులారా, దేవుడంటే భయభక్తులున్న వారలారా, వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకులను ఏర్పరచుకుని, వారు ఐగుప్తు దేశంలో ఉన్నపుడు ఆ ప్రజలను అసంఖ్యాకులుగా చేసి, తన భుజబలం చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చాడు.
18సుమారు నలభై ఏళ్ళు అరణ్యంలో వారిని సహించాడు. 19కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశాలను మన ప్రజలకు వారసత్వంగా ఇచ్చాడు. 20ఈ సంఘటనలన్నీ సుమారు 450 సంవత్సరాలు జరిగాయి. ఆ తరువాత సమూయేలు ప్రవక్త వరకూ దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. 21ఆ తరువాత వారు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడూ కీషు కుమారుడూ అయిన సౌలును వారికి నలభై ఏళ్ళ పాటు రాజుగా ఇచ్చాడు. 22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.
23“అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కోసం రక్షకుడైన యేసును పుట్టించాడు. 24ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిసం ప్రకటించాడు. 25యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, “నేనెవరినని మీరనుకుంటున్నారు? నేను ఆయనను కాను. వినండి, నా వెనక ఒకాయన వస్తున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు” అని చెప్పాడు.
26“సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుడంటే భయభక్తులు గలవారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది. 27యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గానీ, ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను గానీ నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు.
28ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా వారు ఆయనను చంపాలని పిలాతును కోరారు. 29ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. 30అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు. 31ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు. 32పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”
33“‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’
అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది. 34ఇంకా, ఇకపై కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపడం ద్వారా,
‘దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను నీకిస్తాను’
అని చెప్పాడు. 35అందుకే వేరొక కీర్తనలో,
‘నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు’ అని చెబుతున్నాడు.
36దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి కన్ను మూశాడు. 37తన పితరుల దగ్గర సమాధి అయి కుళ్ళిపోయాడు గాని, దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. 38కాబట్టి సోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రకటిస్తున్నాము.
39మోషే ధర్మశాస్త్రం మిమ్మల్ని ఏ విషయాల్లో నిర్దోషులుగా తీర్చలేక పోయిందో ఆ విషయాలన్నిటిలో, విశ్వసించే ప్రతివానినీ ఈయనే నిర్దోషిగా తీరుస్తాడని మీకు తెలియాలి. 40కాబట్టి ప్రవక్తలు చెప్పినవి మీ మీదికి రాకుండా జాగ్రత్త పడండి. అవేవంటే,
41‘తిరస్కరిస్తున్న మీరు, విస్మయం చెందండి, నశించండి.
మీ కాలంలో నేను ఒక పని చేస్తాను,
ఆ పని ఎవరైనా మీకు వివరించినా మీరెంత మాత్రమూ నమ్మరు.’”
42పౌలు బర్నబాలు వెళ్ళిపోతుంటే ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినాన మళ్ళీ చెప్పాలని ప్రజలు బతిమిలాడారు. 43సమావేశం ముగిసిన తరువాత చాలామంది యూదులూ, యూదామతంలోకి మారినవారూ, పౌలునూ బర్నబానూ వెంబడించారు. పౌలు బర్నబాలు వారితో మాట్లాడుతూ, దేవుని కృపలో నిలిచి ఉండాలని వారిని ప్రోత్సహించారు.
యూదుల నుండి ప్రతిఘటన
44మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణమంతా దేవుని వాక్కు వినడానికి సమావేశం అయింది. 45యూదులు ఆ జనసమూహాలను చూసి కన్ను కుట్టి, పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి వారిని హేళన చేశారు. 46అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు, “దేవుని వాక్కు మొదట మీకు చెప్పడం అవసరమే. అయినా మీరు దాన్ని తోసివేసి, మీకు మీరే నిత్యజీవానికి అయోగ్యులుగా చేసుకుంటున్నారు. కాబట్టి మేము యూదేతరుల దగ్గరికి వెళ్తున్నాం. 47“ఎందుకంటే,
‘నీవు ప్రపంచమంతటా రక్షణ తెచ్చేవానిగా ఉండేలా నిన్ను యూదేతరులకు వెలుగుగా ఉంచాను’
అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు” అన్నారు.
48యూదేతరులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్కును కొనియాడారు. అంతేగాక నిత్యజీవానికి నియమితులైన వారంతా విశ్వసించారు. 49ప్రభువు వాక్కు ఆ ప్రదేశమంతటా వ్యాపించింది. 50అయితే యూదులు భక్తి మర్యాదలున్న స్త్రీలనూ ఆ పట్టణ ప్రముఖులనూ రెచ్చగొట్టి పౌలునూ బర్నబానూ హింసల పాలు చేసి, వారిని తమ ప్రాంతం నుండి తరిమేశారు.
51అయితే పౌలు బర్నబాలు తమ పాద ధూళిని వారికి దులిపి వేసి ఈకొనియ ఊరికి వచ్చారు. 52అయితే శిష్యులు ఆనందంతో పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 13: IRVTel
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.