YouVersion Logo
Search Icon

2 దిన 11

11
రెహబాము నిర్మించిన ప్రాకారాలు
1రెహబాము యెరూషలేముకు వచ్చిన తరవాత అతడు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి, రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోడానికి యూదావారిలో నుండీ బెన్యామీనీయుల్లో నుండీ ఎన్నిక చేసిన 1, 80,000 మంది సైనికులను సమకూర్చాడు.
2అయితే దేవుని మనిషి షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు, 3“నువ్వు వెళ్ళి యూదారాజు, సొలొమోను కొడుకు అయిన రెహబాముతో, యూదాలో, బెన్యామీనీయుల ప్రాంతంలో ఉండే ఇశ్రాయేలు వారందరితో ఈ మాట చెప్పు, 4‘ఇదంతా ఈ విధంగా జరిగేలా చేసింది నేనే’ అని యెహోవా సెలవిస్తున్నాడు కాబట్టి మీ ఉత్తరలో ఉన్న యూదా సోదరులతో యుద్ధం చేయడానికి బయలు దేరకుండా మీరంతా మీ మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళండి.” కాబట్టి వారు యెహోవా మాట విని యరొబాముతో యుద్ధం చేయడం మానేసి తిరిగి వెళ్లిపోయారు.
5రెహబాము యెరూషలేములో నివాసముండి యూదా ప్రాంతంలో పురాలకు ప్రాకారాలు కట్టించాడు. 6అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, 7బేత్సూరు, శోకో, అదుల్లాము, 8గాతు, మారేషా, జీఫు, 9అదోరయీము, లాకీషు, అజేకా, 10జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అనే యూదా, బెన్యామీను ప్రదేశాల్లో ప్రాకారాలు కట్టించాడు. 11అతడు కోట దుర్గాలను దృఢంగా చేసి, వాటిలో సైన్యాధికారులను ఉంచి, వారికి ఆహారం, నూనె, ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు. 12వాటిలో డాళ్ళు, శూలాలు ఉంచి ఆ పట్టణాలను శక్తివంతంగా తయారు చేశాడు. యూదా వారు, బెన్యామీనీయులు అతని వైపు నిలబడ్డారు.
13ఇశ్రాయేలువారి మధ్య నివసిస్తున్న యాజకులు, లేవీయులు తమ ప్రాంతాల సరిహద్దులు దాటి అతని దగ్గరికి వచ్చారు. 14యరొబాము, అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయడం వలన వారు తమ గ్రామాలూ, ఆస్తులూ విడిచిపెట్టి, యూదా దేశానికి, యెరూషలేముకు వచ్చారు.
15యరొబాము బలిపీఠాలకు దయ్యాలకు తాను చేయించిన దూడవిగ్రహాలకు యాజకులను నియమించుకున్నాడు. 16ఇలా ఉండగా ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో తమ దేవుడైన యెహోవాను వెదకడానికి తమ మనస్సులో నిర్ణయించుకున్నవారు కొందరు ఉన్నారు. వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులర్పించడానికి యెరూషలేముకు వచ్చారు. 17వారు మూడు సంవత్సరాలు దావీదు, సొలొమోను నడిచిన మార్గాన్నే అనుసరించారు. ఆ మూడు సంవత్సరాలూ వారు యూదా రాజ్యాన్ని బలపరచి సొలొమోను కొడుకు రెహబాముకు సహాయం చేశారు.
రెహబాము కుటుంబం
18దావీదు కొడుకు యెరీమోతు కుమార్తె అయిన మహలతును రెహబాము వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కొడుకు ఏలీయాబు కుమార్తె అయిన అబీహాయిలు. 19అతనికి యూషు, షెమర్యా, జహము అనే కొడుకులు పుట్టారు. 20తరవాత అతడు అబ్షాలోము కుమార్తె మయకాను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి అబీయా, అత్తయి, జీజా, షెలోమీతులు పుట్టారు.
21రెహబాముకు 18 మంది భార్యలు 60 మంది ఉపపత్నులు ఉన్నారు. అతనికి 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు ఉన్నారు. అయితే తన భార్యలందరిలో ఉపపత్నులందరిలో అబ్షాలోము కుమార్తె మయకాను అతడు ఎక్కువగా ప్రేమించాడు.
22రెహబాము మయకాకు పుట్టిన అబీయాను రాజుగా చేయాలని ఆలోచించి, అతని సోదరుల మీద ప్రధానిగా, అధిపతిగా అతణ్ణి నియమించాడు. 23అతడు మంచి మెలకువతో పరిపాలించాడు. తన కుమారుల్లో మిగిలిన వారిని అతడు యూదా, బెన్యామీనులకు చెందిన ప్రదేశాల్లోని ప్రాకార పురాల్లో అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన ఆస్తినిచ్చి వారికి పెళ్ళిళ్ళు చేశాడు.

Currently Selected:

2 దిన 11: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in