YouVersion Logo
Search Icon

1 కొరింతీ పత్రిక 16

16
అంతిమ హెచ్చరికలు, అభినందనలు
1పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి. 2నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి. 3నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను. 4నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
5నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను. 6అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
7ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు. 8కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను. 9ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
10తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు. 11కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
12సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
13మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి. 14మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
15స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు. 16కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
17స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది. 18నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.
19ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు. 20ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
21పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను. 22ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.
23ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక. 24క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్‌.

Highlight

Copy

Compare

Share

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in