సంఖ్యాకాండము 22:1-12
సంఖ్యాకాండము 22:1-12 TELUBSI
తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో –ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో–యీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బసచేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి–నీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా బిలాము దేవునితో యిట్లనెను–సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు –చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు–నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.


