YouVersion Logo
Search Icon

మార్కు 9

9
1మరియు ఆయన – ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు దేవునిరాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.
2ఆరుదినములైన తరువాత, యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి, వారియెదుట రూపాంతరము పొందెను. 3అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువచేయలేడు. 4మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. 5అప్పుడు పేతురు–బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను; 6వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. 7మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా –ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. 8వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
9వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా–మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. 10మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. 11వారు–ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి. 12అందుకాయన–ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి? 13ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను.
14వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. 15వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి. 16అప్పుడాయన–మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా 17జనసమూహములో ఒకడు– బోధకుడా, మూగదయ్యము#9:17 మూలభాషలో–మూగాత్మ. పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; 18అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. 19అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా 20వారాయనయొద్దకు వానిని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. 21అప్పుడాయన –ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు–బాల్యమునుండియే; 22అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. 23అందుకు యేసు–(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. 24వెంటనే ఆ చిన్నవాని తండ్రి–నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని#9:24 కొన్ని ప్రాచీన ప్రతులలో–కన్నీళ్లు విడిచి, అని కూర్చబడినది. బిగ్గరగా చెప్పెను. 25జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తికొనివచ్చుట యేసు చూచి–మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. 26అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు–వాడు చనిపోయెననిరి. 27అయితే యేసు వాని చెయ్యి పెట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. 28ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు–మే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి. 29అందుకాయన–ప్రార్థనవలననే#9:29 అనేక ప్రాచీన ప్రతులలో–(వలనను) ఉపవాసమువలననే అని కూర్చబడి యున్నది. 44, 46 వచనములు, 48 వ వచనముతో సమానము. గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
30వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లుచుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను; 31ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు –మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడు చున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడుదినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. 32వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.
33అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు– ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక 34ఆయన ఇంట ఉన్నప్పుడు–మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని వారినడుగగా 35వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పండ్రెండుమందిని పిలిచి–ఎవడైనను మొదటి వాడైయుండ గోరినయెడల, వాడందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెనని చెప్పి 36యొక చిన్న బిడ్డను తీసికొని వారిమధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని 37–ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చు కొనునని వారితో చెప్పెను.
38అంతట యోహాను–బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. 39అందుకు యేసు–వానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; 40మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే. 41మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. 42నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. 43-44నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులుకలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. 45-46నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; రెండు పాదములుకలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుటమేలు. 47నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల దాని తీసిపార వేయుము; రెండు కన్నులుకలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. 48నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు. 49ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును. 50ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైనయెడల దేనివలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy