YouVersion Logo
Search Icon

మార్కు 6

6
1ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. 2విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి–ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి? 3ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. 4అందుకు యేసు–ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. 5అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.
6ఆయన చుట్టుపెట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.
7ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మలమీద వారి కధికారమిచ్చి 8–ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక 9చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొన వద్దనియు వారికాజ్ఞాపించెను. 10మరియు ఆయన వారితో ఇట్లనెను – మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి. 11ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. 12కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు 13అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి.
14ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని–బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడుగనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. 15ఇతరులు –ఈయన ఏలీయా అనియు, మరికొందరు–ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. 16అయితే హేరోదు విని–నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను. 17హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను–నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక 18ఇతడామె నిమిత్తము యోహానును పెట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను. 19-20హేరోదియ అతని మీద పగపెట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. 21అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖు లకును విందుచేయించెను. 22అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితోకూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు–నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. 23మరియు–నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను 24గనుక ఆమె వెళ్లి –నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె–బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. 25వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి–బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. 26రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను. 27వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి 28పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. 29యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.
30అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియ జేసిరి. 31అప్పుడాయన–మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. 32కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. 33వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకనుపరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి. 34గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింప సాగెను. 35చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది; 36చుట్టుపెట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమున కేమైనను కొనుక్కొనుటకు వారిని పంపి వేయుమని చెప్పిరి. 37అందుకాయన – మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు–మేము వెళ్లి యీన్నూరు దేనారముల#6:37 ఇది ఇంచు మించు 106 రూపాయలు కావచ్చును. రొట్టెలుకొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి. 38-39అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని –అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి. అప్పుడాయన – పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా 40వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. 41అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను. 42-43వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి. 44ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు.
45ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. 46ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను. 47సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. 48అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను. 49ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలువేసిరి. 50అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి– ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. 51తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి; 52అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు.
53వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పెట్టిరి. 54వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపెట్టి 55ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి. 56గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీదులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy