YouVersion Logo
Search Icon

యిర్మీయా 31

31
1యెహోవా వాక్కు ఇదే–ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలైయుందురు. 2యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఖడ్గమును తప్పించుకొనినవారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతినొందునట్లు నేను వెళ్లుదుననుచున్నాడు. 3చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను– శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను. 4ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు. 5నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు. 6ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి–సీయోనునకు మన దేవుడైన యెహోవాయొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. 7యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతిచేయుడి–యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి. 8ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు 9వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
10జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోనివారికి దాని ప్రకటింపుడి–ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱెలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. 11యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటె బలవంతుడైన వాని చేతిలోనుండి వారిని విడిపించుచున్నాడు 12వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవాచేయు ఉపకారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమునుబట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱెలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు. 13వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆద రించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలును యౌవనులును వృద్ధులును కూడి నాట్యమందు సంతోషించెదరు. 14క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు; ఇదే యెహోవా వాక్కు.
15యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. 16యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము; నీ క్రియ సఫలమై, జనులు శత్రువుని దేశములోనుండి తిరిగి వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు. 17రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు. 18నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటుకాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పినయెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. 19–నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని. 20ఎఫ్రాయిము నా కిష్టమైన కుమారుడా? నాకు ముద్దు బిడ్డా? నేనతనికి విరోధముగ మాటలాడునప్పుడెల్ల అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది, అతనిగూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది, తప్పక నేనతని కరుణింతును; ఇదే యెహోవా వాక్కు.
21ఇశ్రాయేలు కుమారీ, సరిహద్దురాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్లిన రాజమార్గముతట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము; ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. 22నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.
23ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–చెరలోనుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోను దాని పట్టణములలోను జనులు–నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. 24అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుదును. 25కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరును పట్టణస్థులందరును వారి దేశములో కాపురముందురు. 26అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోద మాయెను. 27యెహోవా వాక్కు ఇదే – ఇశ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. 28వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుటకును నాశనము చేయుటకును హింసించుటకును నేనేలాగు కనిపెట్టియుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు. 29ఆ దినములలో–తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనను మాట వాడుకొనరు. 30ప్రతివాడు తన దోషముచేతనే మృతినొందును; ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్లే పులియును.
31–ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధనచేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. 32అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. 33ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. 34నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డును–యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యెహోవా వాక్కు. 35పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. 36–ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు. 37యెహోవా సెలవిచ్చునదేమనగా – పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునా దులను పరిశోధించుటయు శక్యమైనయెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమునుబట్టి నేను వారినందరిని తోసి వేతును; యెహోవా వాక్కు ఇదే. 38యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మమువరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును. 39కొలనూలు దాని కెదు రుగా గారేబుకొండవరకు పోవుచు గోయావరకు తిరిగి సాగును. 40శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy