YouVersion Logo
Search Icon

ఎస్తేరు 1

1
1అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము : హిందూదేశము మొదలుకొని కూషు#1:1 ఐతియొపియ. దేశమువరకు నూట ఇరువదియేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను. 2ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలోనుండి రాజ్యపరిపాలన చేయుచుండగా 3తన యేలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందుచేయించెను. పారసీక దేశముయొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధి నుండగా 4అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను. 5ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందుచేయించెను. 6అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను. 7అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. 8ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోటపనివారికి రాజు ఆజ్ఞ నిచ్చి యుండెను. 9రాణియైన వష్తి కూడ రాజైన అహష్వే రోషు కోటలో స్త్రీలకు ఒక విందుచేయించెను.
10ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతో షముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు 11రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారముచేయు మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. 12రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను. 13విధిని రాజ్యధర్మమును ఎరిగినవారందరిచేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక 14అతడు కాలజ్ఞానులను చూచి–రాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను. 15అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమపీఠములమీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా–కర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెసు మర్సెనా మెమూకాను అనువారు. 16మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను–రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషుయొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను. 17ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దాని విని, ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. 18మరియు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమాచారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. 19రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమయొద్దనుండి యొక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు న్యాయముచొప్పున నియమింపవలెను. మరియు వష్తికంటె యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. 20మరియు రాజుచేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘను రాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. 21ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను. 22ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాతప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy