YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 1

1
1యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో#1:1 మృతసముద్రము దగ్గరనున్న లోయ. మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. 2హోరేబునుండి శేయీరు మన్నెపుమార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము. 3హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును అష్తారోతులో నివసించిన బాషానురాజైన ఓగును ఎద్రెయీలో హతము చేసినతరువాత 4నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తన కాజ్ఞా పించినదంతయు వారితో చెప్పెను. 5యొర్దాను ఇవతలనున్న మోయాబు దేశమున మోషే యీ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను 6– మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను –ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును; 7మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబాలోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్రతీరములోనున్న స్థలములన్నిటికిని, కనానుదేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసువరకును#1:7 ఫరాతు. వెళ్లుడి. 8ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీపితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి. 9అప్పుడు నేను–ఒంటరిగా మిమ్మును భరింపలేను. 10మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింప జేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రములవలె విస్తరించియున్నారు. 11మీపితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను వెయ్యిరెట్లు ఎక్కువచేసి, తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. 12నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను? 13జ్ఞానవివేకములు కలిగి, మీ మీ గోత్రములలో ప్రసిద్ధిచెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి; వారిని మీమీద నియమించెదనని మీతో చెప్పగా 14మీరు–నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. 15కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని. 16అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో–మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతిమనుష్యునికిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను. 17తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసికొని రావలెను; నేను దానిని విచారించెదనని వారికాజ్ఞాపించితిని. 18మరియు మీరు చేయవలసిన సమస్తకార్యములనుగూర్చి అప్పుడు మీకాజ్ఞాపించితిని.
19మనము హోరేబునుండి సాగి మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములోనుండి వచ్చి, అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. 20అప్పుడు నేను–మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చియున్నాము. 21ఇదిగో నీ దేవుడైన యెహోవా యీ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. 22అప్పుడు మీరందరు నాయొద్దకు వచ్చి–మనకంటె ముందుగా మనుష్యులను పంపుదము; వారు మనకొరకు ఈ దేశమును వేగు జూచి, తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్లవలసిన త్రోవనుగూర్చియు, మనము చేర వలసిన పురములనుగూర్చియు మనకు వర్తమానము చెప్పుదు రంటిరి. 23ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించితిని. 24వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుజూచి ఆ దేశఫలములను చేతపట్టుకొని 25మనయొద్దకు తీసికొని వచ్చి–మన దేవుడైన యెహోవా మన కిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. 26అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి 27మీ గుడారములలో సణుగుచు–యెహోవా మనయందు పగపెట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములోనుండి మనలను రప్పించియున్నాడు. 28మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు–అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్త రులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశము నంటు ప్రాకారములతో నున్నవి; అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. 29అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, 30మీకు ముందర నడుచు చున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నులయెదుట 31ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. 32అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు 33రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాసముంచలేదు. 34కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని 35బహుగా కోపపడి–నేను మీపితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో 36యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను. 37మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి–నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశిం చునుగాని నీవు దానిలో ప్రవేశింపవు. 38అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొన చేయును గనుక అతని ధైర్యపరచుము. 39ఆ దినమున మంచి చెడ్డలనెరుగని మీ కుమారులు, అనగా–అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు; దానిని వారి కిచ్చెదను; వారు దానిని స్వాధీనపరచుకొందురు. 40మీరు తిరిగి ఎఱ్ఱసముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను. 41అందుకు మీరు–మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి; మా దేవుడైన యెహోవా మా కాజ్ఞాపించిన మాటలన్నిటి ననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా 42యెహోవా నాతో ఇట్లనెను–యుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండను గనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. 43ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి. 44అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి. 45తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా మీ మొఱను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. 46కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy