YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 15

15
1కొందరు యూదయనుండి వచ్చి–మీరు మోషే . నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. 2పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి. 3కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి. 4వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడై యుండి చేసినవన్నియు వారు వివరించిరి. 5పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి.
6అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను–
7సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. 8మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను. 9వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు 10గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు? 11ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.
12అంతట ఆ సమూహమంతయు ఊరకుండి, బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. 13వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను–సహోదరులారా, నా మాట ఆలకించుడి. 14అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు. 15ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా–
16ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను;
మనుష్యులలో కడమవారును
నా నామము ఎవరికి పెట్టబడెనో
ఆ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు
17పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను
దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెద
నని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియ
18పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు
అని వ్రాయబడియున్నది. 19కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపట్టక 20విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. 21ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలనమునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.
22అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. 23వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా–అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము. 24కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు 25-26గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకంద రికి ఏకాభిప్రాయము కలిగెను. 27కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. 28-29విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.
30అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. 31వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. 32మరియు యూదాయు సీలయు కూడ ప్రవక్తలై యుండి నందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి. 33-34వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. 35అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి, యింక అనేకులతోకూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.
36కొన్ని దినములైన తరువాత–ఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. 37అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను. 38అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. 39వారిలో తీవ్రమైన వాదము కలిగినందునవారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను; 40-41పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి, సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy