Logo YouVersion
Ikona vyhledávání

రోమా పత్రిక 9

9
ఇశ్రాయేలీయుల కోసం పౌలు ఆవేదన
1నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. 2నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. 3నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. 4వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. 5పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవునిగా వారిలోనే పుట్టారు. ఆయన నిత్యం స్తోత్రార్హుడు! ఆమేన్.
దేవుని సార్వభౌమ ఎంపిక
6దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు. 7అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే, “ఎందుకంటే ఇస్సాకు మూలంగా కలిగిన వారిగానే నీ సంతానం లెక్కించబడుతుంది.”#9:7 ఆది 21:12 8మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలే అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు. 9అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు”#9:9 ఆది 18:10,14 అని వాగ్దానం ఇవ్వబడింది.
10అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భవతియైన సమయంలో, 11కవలలు ఇంకా పుట్టి మంచి చెడు ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం, దేవుని ఉద్దేశం, క్రియలమూలంగా కాకుండా, 12పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి, “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు”#9:12 ఆది 25:23 అని ఆమెతో చెప్పబడింది. 13“నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను”#9:13 మలాకీ 1:2,3 అని వ్రాయబడి ఉన్నది.
14అయితే మనం ఏమనాలి? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! 15ఎందుకంటే ఆయన మోషేతో,
“నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను,
నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను”#9:15 నిర్గమ 33:19 అని చెప్పారు.
16కాబట్టి ఇది ఒకరి కోరిక మీద గాని ప్రయాస మీద గాని ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరం వలనే అవుతుంది. 17అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో చూపించాలని, భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను నియమించాను.”#9:17 నిర్గమ 9:16 18కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు.
19మీరు నాతో, “అలాగైతే ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని ఎవరు అడ్డుకోగలరు?” అనవచ్చు, 20కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”#9:20 యెషయా 29:16; 45:9 21ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా?
22దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి కోరుకున్నప్పటికి, నాశనం కోసం సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి? 23మహిమ కోసం ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి, 24అనగా యూదులలో నుండి మాత్రమే కాక యూదేతరులలో నుండి ఆయన పిలిచిన మన కోసం తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి? 25హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం,
“నా ప్రజలు కాని వారిని ‘నా ప్రజలు’ అని పిలుస్తాను;
నాకు ప్రియురాలు కాని దానిని ‘నా ప్రియురాలు’ అని పిలుస్తాను,”#9:25 హోషేయ 2:23
26ఇంకా,
“ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో,
అదే స్థలంలో వారు
‘సజీవుడైన దేవుని పిల్లలు’ అని పిలువబడతారు.”#9:26 హోషేయ 1:10
27ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు:
“ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకంత విస్తారంగా ఉన్నా,
వారిలో మిగిలి ఉన్నవారే రక్షించబడతారు.
28ప్రభువు తాను చెప్పిన మాటను
భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తారు.”#9:28 యెషయా 10:22,23
29యెషయా గతంలో చెప్పినట్లుగా,
“సైన్యాల ప్రభువు
మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే
మనం సొదొమలా మారేవారం,
గొమొర్రాను పోలి ఉండేవారము.”#9:29 యెషయా 1:9
ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం
30అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్నిబట్టి నీతిని పొందుకున్నారు. 31కాని నీతి మార్గంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 32వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసంతో కాకుండా క్రియలతో అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు. 33దీని కోసం ఇలా వ్రాయబడి ఉంది:
“ఇదిగో, నేను సీయోనులో ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయిని,
వారు పడిపోయేలా చేసే అడ్డుబండను వేశాను,
ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు.”#9:33 యెషయా 8:14; 28:16

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas