Logo YouVersion
Ikona vyhledávání

రోమా పత్రిక 8

8
ఆత్మ ద్వారా జీవం
1కాబట్టి, ఎవరైతే క్రీస్తు యేసులో ఉన్నారో వారికి శిక్షావిధి లేదు. 2ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని#8:2 గ్రీకులో ఏకవచనం; కొన్ని ప్రతులలో నన్ను పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది. 3శరీరాన్ని#8:3 శరీరాన్ని ఈ సందర్భాలలో గ్రీకు పదం మానవుల పాపస్ధితిని తెలియచేస్తుంది. బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయలేకపోయిందో దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారబలిగా తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు. 4శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించే మనలో ధర్మశాస్త్రం యొక్క నీతి నియమాలను నెరవేర్చడానికి ఇలా జరిగింది.
5శరీరానుసారంగా జీవించేవారి మనస్సు శారీరక ఆశలపైనే ఉంటుంది. కాని ఆత్మానుసారంగా జీవించేవారి మనస్సు ఆత్మ సంబంధమైన ఆశలపైన ఉంటుంది. 6శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది. 7శరీరానుసారమైన మనస్సు దేవునికి విరుద్ధమైనది; అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడి ఉండదు, దాని ప్రకారం నడుచుకోదు. 8శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు.
9అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కాబట్టి శరీర స్వభావం కలిగి ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుకు చెందినవారు కారు. 10క్రీస్తు మీలో ఉన్నట్లయితే పాపాన్ని బట్టి మీ శరీరం మరణించినా, నీతిని బట్టి ఆత్మ జీవిస్తుంది#8:10 జీవిస్తుంది లేదా పాపం వలన మీ శరీరం మరణించినా మీ ఆత్మ జీవించి ఉంటుంది. 11యేసును మరణం నుండి సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, క్రీస్తును మరణం నుండి సజీవంగా లేపిన ఆయన నాశనమయ్యే మీ శరీరాలకు కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇవ్వగలరు.
12కాబట్టి సహోదరి సహోదరులారా, శరీరానుసారంగా జీవించడానికి మనం శరీరానికి రుణస్థులము కాము. 13మీరు శరీరానుసారంగా జీవిస్తే మీరు మరణిస్తారు. కాని ఒకవేళ ఆత్మ ద్వారా శరీర సంబంధమైన చెడ్డక్రియలను చంపివేస్తే మీరు బ్రతుకుతారు.
14ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. 15మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాము. 16మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడు. 17మనం పిల్లలమైతే వారసులం, అంటే దేవుని వారసులం; క్రీస్తు మహిమను మనం కూడా పొందడానికి ఆయనతో శ్రమపడితే క్రీస్తు సహ వారసులమవుతాం.
ప్రస్తుత శ్రమ, భవిష్యత్ మహిమ
18మనలో ప్రత్యక్షం కాబోయే మహిమతో ఇప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎంత మాత్రం పోల్చదగినవి కావని నేను భావిస్తాను. 19దేవుని బిడ్డలు ప్రత్యక్షపరచబడాలని సృష్టి అంతా ఆతురతతో ఎదురుచూస్తూ ఉంది. 20తన ఇష్ట ప్రకారం కాక దానిని అప్పగించినవాని చిత్తప్రకారం నిరాశకు గురైన సృష్టి నిరీక్షణ కలిగి ఉంది. 21సృష్టి, నశించిపోవడమనే దాస్యం నుండి విడిపించబడి, దేవుని బిడ్డల మహిమలోనికి స్వాతంత్ర్యంలోనికి తీసుకురాబడుతుందనే ఆ నిరీక్షణ.
22నేటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన పడుతున్నట్లుగా మూల్గుతున్నదని మనకు తెలుసు. 23అది మాత్రమే కాదు, ఆత్మలో ప్రథమ ఫలం పొందిన మనం కూడా దత్తపుత్రులంగా అవ్వడానికి మన శరీరాల విమోచన కోసం ఆతురతగా ఎదురుచూస్తూ మన లోలోపల మూలుగుతున్నాము. 24ఈ నిరీక్షణలోనే మనం రక్షించబడ్డాము. అయితే కనబడే నిరీక్షణ ఎంత మాత్రం నిరీక్షణ కాదు. తాము చూస్తున్న వాటికోసం ఎవరు నిరీక్షిస్తారు? 25అయితే మన దగ్గర లేని దాని కోసం మనం నిరీక్షిస్తే ఓపికగా ఎదురుచూడగలము.
26అదే విధంగా మన బలహీనతల్లో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. దేని గురించి ప్రార్థించాలో మనకు తెలియదు కాని, మన కోసం ఆత్మ తానే మాటల్లేని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. 27మన హృదయాలను పరిశోధించే ఆయనకు ఆత్మ యొక్క మనస్సు తెలుసు, ఎందుకనగా దేవుని ప్రజల కోసం దేవుని చిత్తప్రకారం ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు.
28దేవుని ప్రేమించేవారికి అనగా దేవుని ఉద్దేశం ప్రకారం పిలువబడిన వారి మంచి జరిగేలా అన్నిటిని దేవుడు జరిగిస్తారని మనకు తెలుసు. 29అనేకులైన సహోదరి సహోదరుల మధ్యలో ఆయన ప్రథమ సంతానంగా ఉండాలని దేవుడు తాను ముందుగానే ఎరిగినవారిని తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా ఉండేలా వారిని ముందుగానే నిర్ణయించారు. 30ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని ఆయన పిలిచారు; ఆయన ఎవరిని పిలిచారో వారిని నీతిమంతులుగా తీర్చారు; ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చారో వారిని మహిమపరిచారు.
దేవుని ప్రేమ నుండి ఏదీ మనలను వేరుచేయలేదు
31అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు? 32దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలరు? 33దేవుడు ఏర్పరచుకున్నవారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసేవారు ఎవరు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే కదా! 34అయితే శిక్షను విధించేవారు ఎవరు? సజీవంగా తిరిగి లేచి, దేవుని కుడి వైపున కూర్చుండి మన కోసం దేవుని వేడుకొనే యేసు క్రీస్తే తప్ప మరి ఎవరూ కాదు. 35క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా? 36లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది:
“రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం;
వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.”#8:36 కీర్తన 44:22
37అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము. 38మరణమైనా జీవమైనా, దేవదూతలైనా దయ్యాలైనా, నేడైనా రేపైనా, ఎటువంటి శక్తులైనా, 39ఎత్తైనా లోతైనా, సృష్టిలో ఉన్న ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవని నేను ఒప్పుకుంటున్నాను.

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas