అపొస్తలుల కార్యములు 18
18
కొరింథీ పట్టణంలో పౌలు
1ఆ తర్వాత, పౌలు ఏథెన్సు పట్టణం నుండి కొరింథీ పట్టణానికి వెళ్లాడు. 2అక్కడ పొంతు అనే ప్రాంతానికి చెందిన అకుల అనే ఒక యూదుడు తన భార్య ప్రిస్కిల్లతో కలిసి, యూదులందరు రోమా ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలనే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞమేరకు ఇటలీ దేశం నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్లాడు. 3పౌలు కూడా వారిలా డేరాలను తయారుచేసేవాడు, కాబట్టి అతడు వారితో నివసిస్తూ కలిసి పని చేశాడు. 4అతడు యూదులను గ్రీసుదేశస్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తూ, ప్రతి సబ్బాతు దినాన సమాజమందిరంలో తర్కించేవాడు.
5సీల తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు, పౌలు యేసే క్రీస్తు అని యూదులకు ప్రకటించడానికి, సాక్ష్యమివ్వడానికి తనను తాను ప్రత్యేకంగా అంకితం చేసుకున్నాడు. 6అయితే వారు పౌలును దూషిస్తూ ఎదురు తిరిగినప్పుడు, అతడు తన వస్త్రాలను దులుపుకొని, “ ‘మీ రక్తం మీ తలల మీదికే వచ్చు గాక!’ నేనైతే ఈ విషయంలో నిర్దోషిని. ఇక ఇప్పటినుండి నేను యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాను” అని వారితో చెప్పాడు.
7పౌలు సమాజమందిరం నుండి బయటకు వెళ్లి దాని ప్రక్కనే ఆనుకుని ఉన్న దేవుని ఆరాధించే తీతియు యూస్తు అనే వాని ఇంటికి వచ్చాడు. 8ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు అతని కుటుంబమంతా ప్రభువును నమ్ముకున్నారు; అలాగే పౌలు మాటలు విన్న చాలామంది కొరింథీయులు నమ్మి బాప్తిస్మం పొందుకున్నారు.
9ఒక రాత్రి దర్శనంలో ప్రభువు పౌలుతో, “భయపడకు; మాట్లాడుతూనే ఉండు, మౌనంగా ఉండకు. 10ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరు నీ మీద దాడి చేసి నీకు హాని చేయరు, ఈ పట్టణంలో నాకు చెందిన ప్రజలు చాలామంది ఉన్నారు” అని చెప్పారు. 11కాబట్టి ఒకటిన్నర సంవత్సరం పాటు పౌలు అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని వారికి బోధించాడు.
12అకాయ ప్రాంతానికి గల్లియో అధిపతిగా ఉన్నపుడు, కొరింథీలోని యూదులందరు కలిసి పౌలు మీద దాడి చేసి, అతన్ని న్యాయస్థానానికి తీసుకుని వచ్చారు. 13వారు అతని మీద, “ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పద్ధతులతో దేవుని ఆరాధించండని ప్రజలను ఒప్పిస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు.
14పౌలు మాట్లాడడం ఆరంభిస్తుండగా, గల్లియో వారితో, “యూదులారా, మీరు ఒక అన్యాయం లేదా నేరానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే, నేను మీ మాటలు వినడం న్యాయంగా ఉంటుంది. 15కాని ఇది మీ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు, మాటలు, పేర్ల గురించే కాబట్టి మీరే పరిష్కరించుకోండి. అలాంటి విషయాలకు నేను న్యాయాధికారిని కాను” అని వారితో చెప్పి, 16వారందరిని అక్కడినుండి పంపేశాడు. 17అప్పుడు ఆ ప్రజలందరు సమాజమందిరపు అధికారి సోస్తెనేసును పట్టుకుని న్యాయస్థానం ముందు కొట్టారు, అయినా కానీ గల్లియో దాని గురించి ఏమి పట్టించుకోలేదు.
అకుల, ప్రిస్కిల్ల, అపొల్లో
18పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల దగ్గర సెలవు తీసుకుని, అకుల ప్రిస్కిల్లతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకున్నాడు. 19వారు ఎఫెసుకు చేరుకున్నాక, పౌలు అకుల ప్రిస్కిల్లను అక్కడ విడిచిపెట్టాడు. తాను ఒక్కడే సమాజమందిరంలోనికి వెళ్లి యూదులతో తర్కించేవాడు. 20వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. 21కానీ వెళ్లేముందు వారితో, “దేవుని చిత్తమైతే నేను తిరిగి వస్తాను” అని వాగ్దానం చేసి, ఎఫెసులో ఓడ ఎక్కి బయలుదేరాడు. 22అతడు కైసరయ తీరాన దిగి, యెరూషలేముకు వెళ్లి సంఘాన్ని పలకరించాడు మళ్ళీ అక్కడినుండి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చాడు.
23అంతియొకయలో కొంతకాలం గడిపిన తర్వాత, పౌలు అక్కడినుండి బయలుదేరి గలతీయ ఫ్రుగియ పరిసర ప్రాంతాలంతట, ఒక స్థలం నుండి మరొక స్థలానికి తిరుగుతూ శిష్యులందరిని బలపరిచాడు.
24ఆ సమయంలో అలెక్సంద్రియ పట్టణానికి చెందిన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్యావంతుడు, లేఖనాల్లో పూర్తి ప్రవీణ్యత కలిగినవాడు. 25అతడు ప్రభువు మార్గం గురించి ఉపదేశాన్ని పొంది, తనకి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలిసినప్పటికీ చాలా ఆసక్తితో#18:25 లేదా ఆత్మలో ఆసక్తితో యేసు గురించి స్పష్టంగా బోధిస్తున్నాడు. 26అతడు సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అకుల ప్రిస్కిల్లలు అతని మాటలను విని, అతన్ని తమ ఇంటికి ఆహ్వానించి దేవుని మార్గం గురించి మరింత పూర్తిగా అతనికి వివరించారు.
27అపొల్లో అకాయ ప్రాంతానికి వెళ్లాలని తలంచినప్పుడు అక్కడి సహోదరి సహోదరులు అతన్ని ప్రోత్సహించి, అతన్ని చేర్చుకోవాలని అకాయలోని శిష్యులకు ఉత్తరాన్ని వ్రాసి పంపారు. అతడు అక్కడికి చేరినప్పుడు కృప చేత నమ్మిన వారికి అతడు గొప్ప సహాయంగా నిలిచాడు. 28ఎందుకంటే, అతడు లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తు అని నిరూపిస్తూ తనకు వ్యతిరేకంగా ఉన్న యూదుల వాదనలను బహిరంగంగా గట్టిగా ఖండించాడు.
Právě zvoleno:
అపొస్తలుల కార్యములు 18: TSA
Zvýraznění
Sdílet
Kopírovat
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.