Logo YouVersion
Ikona vyhledávání

అపొస్తలుల కార్యములు 17

17
థెస్సలొనీక పట్టణంలో పౌలు
1పౌలు అతనితో ఉన్నవారు అంఫిపొలి అపొల్లోనియ అనే పట్టణాల గుండా థెస్సలొనీక పట్టణానికి చేరుకొన్నారు, అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. 2పౌలు తన అలవాటు ప్రకారం, మూడు సబ్బాతు దినాలు సమాజమందిరంలోనికి వెళ్లి లేఖనాల్లో నుండి వారితో చర్చిస్తూ, 3క్రీస్తు ఏ విధంగా శ్రమలను అనుభవించి, చావు నుండి తిరిగి లేచాడో వారికి నిరూపిస్తూ, “మేము ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తు అని” వివరించాడు. 4కొంతమంది యూదులు ఒప్పింపబడి పౌలు సీలలతో చేరారు, అదే విధంగా పెద్ద సంఖ్యలో దేవునికి భయపడే గ్రీసు దేశస్థులు, కొద్దిమంది ప్రముఖ స్త్రీలు కూడా చేరారు.
5కానీ ఆ బోధను నమ్మని ఇతర యూదులు అసూయపడ్డారు; వారు సంతవీధులలోని పోకిరివారిని తమ వెంటపెట్టుకుని గుంపుగా చేరి పట్టణంలో అల్లరిని సృష్టించారు. వారు పౌలు సీలలను ప్రజల మధ్యకు తీసుకురావాలని వారిని వెదకడానికి యాసోను ఇంటి మీద దాడి చేశారు. 6కానీ వారు అక్కడ కనబడలేదు కాబట్టి వారు యాసోనును మరికొందరు విశ్వాసులను పట్టణపు అధికారుల దగ్గరకు ఈడ్చుకొని వచ్చి, “భూలోకాన్ని తలక్రిందులు చేసినవారు ఇక్కడకు కూడా వచ్చారు. 7యాసోను వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. వీరందరు యేసు అనే మరొక రాజు ఉన్నాడని చెప్పి, కైసరు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు. 8ఆ మాటలను విన్న జనసమూహం, పట్టణ అధికారులు కలవరపడ్డారు. 9వారు యాసోను మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసుకుని విడిచిపెట్టారు.
బెరయాలో పౌలు సీలల పరిచర్య
10రాత్రియైన వెంటనే విశ్వాసులు పౌలును సీలలను అక్కడినుండి బెరయాకు పంపివేశారు. వారు అక్కడ చేరుకొని యూదుల సమాజమందిరానికి వెళ్లారు. 11బెరయాలోని యూదులు థెస్సలొనీకలో ఉండే వారికంటే వాక్యాన్ని శ్రద్ధతో స్వీకరించి పౌలు చెప్పిన సంగతులను సత్యమేనా అని తెలుసుకోవడానికి ప్రతిరోజు లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారు. 12దాని ఫలితంగా, వారిలో చాలామంది యూదులు, అలాగే గ్రీసు దేశపు ప్రముఖులైన స్త్రీలు పురుషులు నమ్మారు.
13కానీ థెస్సలొనీకలోని యూదులు పౌలు దేవుని వాక్యాన్ని బెరయాలో ప్రకటిస్తున్నాడని విన్నప్పుడు, వారిలో కొందరు అక్కడికి కూడా వెళ్లి, ప్రజలను రెచ్చగొట్టి అల్లరి రేపారు. 14కాబట్టి విశ్వాసులు వెంటనే పౌలును అక్కడినుండి సముద్రతీరానికి పంపించారు, కానీ సీల తిమోతిలు బెరయాలోనే ఉండిపోయారు. 15పౌలు వెంట వచ్చినవారు ఏథెన్సు పట్టణం వరకు అతన్ని చేర్చి, సీల తిమోతిలు వీలైనంత తొందరగా తన దగ్గరకు తిరిగి చేరాలి అనే ఆజ్ఞపొంది వెళ్లారు.
ఏథెన్సు పట్టణంలో పౌలు
16పౌలు ఏథెన్సు పట్టణంలో వారి కోసం ఎదురుచూస్తూ, ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉందని చూసి ఎంతో దుఃఖించాడు. 17కాబట్టి సమాజమందిరాల్లో యూదులతో దేవుని భయం కలిగిన గ్రీసు దేశస్థులతో, అదే విధంగా ప్రతిరోజు సంత వీధుల్లో కనిపించే వారందరితో చర్చిస్తూ ఉండేవాడు. 18ఎపికూరీయ అనే గుంపువారు స్తోయికులలో కొందరు జ్ఞానులు పౌలుతో వాదించసాగారు. వారిలో కొందరు, “ఈ వదరుబోతు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు?” అన్నారు. మరికొందరు, “ఇతడు మనకు తెలియని దేవతలను గురించి బోధిస్తున్నాడు” అన్నారు. పౌలు యేసును గురించి పునరుత్థానం గురించి సువార్త ప్రకటించడం వలన వారు అలా అన్నారు. 19వారు అతన్ని వెంటబెట్టుకొని అరేయొపగు అనే సభకు తీసుకెళ్లి, “నీవు బోధిస్తున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకుంటాం మాకు చెప్పు!” అని అడిగారు. 20వారు అతనితో, “నీవు కొన్ని వింతైన ఆలోచనలను మాకు వినిపిస్తున్నావు, మాకు వాటి అర్థం తెలుసుకోవాలని ఉంది” అన్నారు. 21ఏథెన్సు పట్టణానికి చెందినవారు, అక్కడ నివసించే విదేశీయులు అందరు ఏదైనా ఒక క్రొత్త ఆలోచనల గురించి మాట్లాడుతూ వింటూ తమ కాలాన్ని గడిపేవారు.
22అప్పుడు పౌలు అరేయొపగు సభలో లేచి నిలబడి, ఈ విధంగా చెప్పాడు, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లోను చాలా భక్తిపరులుగా ఉన్నారని నేను గమనించాను. 23నేను చుట్టూ తిరుగుతూ మీరు పూజించే వాటిని జాగ్రత్తగా చూసినప్పుడు నాకు కనబడిన ఒక బలిపీఠం మీద,
తెలియని దేవునికి,
అని వ్రాయబడింది. కాబట్టి మీరు తెలియక ఆరాధిస్తున్న దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను.
24“ఈ లోకాన్ని, దానిలోని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆకాశానికి భూమికి ప్రభువు, ఆయన మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో నివసించడు. 25ఆయనే వారందరికి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని అనుగ్రహించేవాడు కాబట్టి ఏదో అవసరం ఉన్నట్లు మానవుల చేతులతో చేసే సేవలు ఆయనకు అవసరం లేదు. 26ఆయన ఒక మనుష్యుని నుండి భూజనులందరిని సృష్టించారు, వారు భూమినంతటిని నింపుతారు. ఆయన వారికి చరిత్రలో సమయాలను, వారి సరిహద్దులను నిర్ణయించారు. 27దేవుడు మనలో ఎవరినుండి దూరంగా ఉండరు కాని, ప్రజలు ఆయనను వెదకి కనుగొని ఆయన దగ్గరకు చేరాలని ఆయన ఈ విధంగా చేశారు. 28‘ఆయనలో మనం బ్రతుకుతున్నాం, కదులుతున్నాం మన ఉనికిని కలిగి ఉన్నాము.’ మీ సొంత కవులు కొందరు, ‘మనం ఆయన సంతానం’ అని అన్నారు.
29“మనం దేవుని సంతానం కాబట్టి, మానవుడు తన నేర్పరితనంతో తయారుచేసి రూపమిచ్చిన బంగారు, వెండి లేదా రాయి బొమ్మలా దైవం ఉంటాడని మనం అనుకోవద్దు. 30గతంలో మానవుని అజ్ఞానాన్ని దేవుడు చూసి చూడనట్లు ఉన్నాడు, కాని ఇప్పుడు ప్రజలందరు ప్రతిచోట పశ్చాత్తాపం పొందాలని ఆయన ఆజ్ఞాపించారు. 31ఎందుకనగా, లోకమంతటికి ఆయన నియమించిన వ్యక్తి ద్వారా నీతితో తీర్పు తీర్చడానికి ఆయన ఒక రోజును నిర్ణయించాడు. దేవుడు ఆయనను మరణం నుండి సజీవంగా లేపి వారందరికి దీనిని రుజువుపరిచాడు.”
32వారు మరణం నుండి తిరిగి లేవడం గురించి విన్నప్పుడు, కొందరు హేళన చేయసాగారు కాని మరికొందరు, “ఈ సంగతిని గురించి మేము మరలా వినాలని అనుకుంటున్నాం” అన్నారు. 33ఆ తర్వాత పౌలు ఆ న్యాయసభ నుండి వెళ్లిపోయాడు. 34అయితే వారిలో కొందరు పౌలు చెప్పిన మాటలను నమ్మి అతని అనుచరులయ్యారు. వారిలో అరేయొపగు సభ సభ్యుడైన దియొనూసియు, దమరి అనే పేరుగల ఒక స్త్రీ, వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు.

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas