ఆమోసు 3
3
ఇశ్రాయేలుకు హెచ్చరిక
1ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం. 2“భూమిమీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
ఇశ్రాయేలు శిక్షకు కారణం
3అంగీకారం లేకుండా
ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు.
4అడవిలో ఉన్న సింహం ఒక జంతువును
పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది.
తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే,
అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం.
5బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు.
బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది.
6హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే
ప్రజలు భయంతో వణుకుతారు.
ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే,
దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.
7నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. 8ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.
9-10అష్డోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్థితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”
11కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశంమీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.”
12యెహోవా ఇది చెపుతున్నాడు:
“ఒక సింహం ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు.
ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు.
సింహం నోటినుండి అతడు రెండు కాళ్లను గాని,
చెవిలో కొంత భాగాన్నిగాని బయటకు లాగవచ్చు.
అదే మాదిరి, ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది రక్షింపబడరు.
సమరయ (షోమ్రోను)లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలనుగాని,
లేక తమ పాన్పులో ఒక గుడ్డముక్కనుగాని రక్షించుకుంటారు.”
13నా ప్రభువును, దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “యాకోబు వంశాన్ని (ఇశ్రాయేలు) ఈ విషయాలను గూర్చి హెచ్చరించు. 14ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులోవున్న బలిపీఠాలనుకూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద పడతాయి. 15శీతాకాలపు విడిదిని, వేసవి విడిదిని కలిపి నేను నాశనం చేస్తాను. దంతపు ఇండ్లు నాశనం చేయబడతాయి. అనేక ఇండ్లు నాశనం చేయబడతాయి” అని యెహోవా చెపుతున్నాడు.
S'ha seleccionat:
ఆమోసు 3: TERV
Subratllat
Copia
Compara
Comparteix
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International