జెకర్యా 1
1
యెహోవా తన ప్రజలు తిరిగి రావాలని కోరుట
1బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా (పారశీకం) రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.
2యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు. 3కావున ప్రజలకు నీవు ఈ విషయాలు తప్పక చెప్పాలి. “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను” అని సర్వశక్తి మంతుడైన యెహోవా చెపుతున్నాడు.
4యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పాడు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.”
5యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు. 6ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించుకొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చుకున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చేసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కావున వారు దేవుని వద్దకు తిరిగి వచ్చారు.”
నాలుగు గుర్రాలకు సంబంధించిన దర్శనం
7పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (షెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. (జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో.)
8రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయటం నేను చూశాను. అతడు లోయలోని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎర్రగుర్రాలు, చుక్కలు చుక్కలుగల గుర్రాలు మరియు తెలుపు గుర్రాలు ఉన్నాయి. 9“అయ్యా, ఈ గుర్రాలు ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను నేను అడిగాను.
అప్పుడు దేవదూత నాతో మాట్లాడుతూ, “ఈ గుర్రాలు ఏనిటో నేను నీకు చెపుతాను” అని అన్నాడు.
10అప్పుడు కదంబచెట్లమధ్య నిలుచున్న మనిషి, “యెహోవా ఈ గుర్రాలను భూలోకమంతా ఇటు అటు తిరగటానికి పంపించాడు” అని చెప్పాడు.
11తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూలోకమంతా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి.
12అందుకు యెహోవా దూత, “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావే” అన్నాడు.
13అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు.
14తరువాత దేవదూత నాతో ఇలా అన్నాడు: ఈ విషయాలను ప్రజలకు చెప్పు. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:
“యెరూషలేముపట్ల, సీయోనుపట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉంది.
15మిక్కిలి క్షేమంగా ఉన్నామని భావించే దేశాలపట్ల నేను చాలా కోపంగా వున్నాను.
నాకు కొంచెం కోపం వచ్చినప్పుడు.
నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను.
కాని ఆ రాజ్యాలు వీరికి చాలా హాని చేశాయి.”
16కాబట్టి యెహోవా ఏమి చెపుతున్నాడంటే, “నేను ప్రేమతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను. యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది.
మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుందని సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు” అని చెప్పు.
17“ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, సర్వశక్తిమంతుడైన యెహోవా,
‘నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి.
నేను సీయోనును ఓదార్చుతాను.
నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను’” అని చెపుతున్నాడు.
నాలుగు కొమ్ములు మరియు నలుగురు పనివారు
18అప్పుడు నేను పైకిచూడగా అక్కడ నాలుగు కొమ్ములు చూశాను. 19నాతో మాట్లాడుతున్న దేవదూతను, “ఈ కొమ్ముల అర్థమేమిటి?” అని అడిగాను.
అతడు ఇలా చెప్పాడు: “ఇవి ఇశ్రాయేలు, యూదా, యెరూషలేము ప్రజలను ఇతర దేశాలకు పోయేలా ఒత్తిడి చేసిన కొమ్ములు.”
20తరువాత యెహోవా నలుగురు పనివారిని నాకు చూపించాడు. 21“ఈ నలుగురు పనివారు ఏమి చేయటానికి వస్తున్నారు?” అని నేనతనిని అడిగాను.
అతడు ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులు ఆ కొమ్ములను నాశనం చేయటానికి వచ్చారు. ఆ కొమ్ములు యూదాప్రజలను అన్యదేశాలకు పోయేలా ఒత్తిడి చేశాయి. ఆ కొమ్ములు ఎవ్వరికీ కనికరం చూపలేదు. యూదా ప్రజలపై దాడిచేసి, వారిని అన్యదేశాలకు వెడలగొట్టిన రాజ్యాలకు చిహ్నలుగా ఈ కొమ్ములు ఉన్నాయి.”
Markert nå:
జెకర్యా 1: TERV
Marker
Kopier
Sammenlign
Del
Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International