హగ్గయి 2

2
యెహోవా ప్రజలను ప్రోత్సహించటం
1దేవుడైన యెహోవా వాక్కు ఏడవనెల ఇరవై ఒకటో రోజున హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది: 2ఇప్పుడు షయల్తీయేలు కుమారుడు, యూదారాజ్య పాలనాధికారి అయిన జెరుబ్బాబెలుతోను, యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువాతోను, మరియు జనులందరితోను మాట్లాడి ఇలా చెప్పు: 3“ఈ ఆలయంయొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు మిగిలారు? ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తు ఉంది? చాలా సంవత్సరాలక్రితం ఉన్న ఆలయంతో పోల్చిచూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు అనిపిస్తూవుందా?” 4కాని ఇప్పుడు యెహోవా చెపుతున్నాడు, “జెరుబ్బాబెలూ! అధైర్యపడవద్దు. యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకడవునైన యెహోషువా! అధైర్యపడవద్దు. ఈ దేశనివాసులైన మీరందరు అధైర్యపడవద్దు అని యెహోవా చెపుతున్నాడు. ఈ పనిని కొనసాగించండి, ఎందుకంటే, నేను మీతో ఉన్నాను అని సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ విషయాలు చెప్పాడు!
5“మీరు ఈజిప్టులోనుండి బయటికి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ప్రకారం, నా ఆత్మ మీ మధ్య ఉంది. భయపడవద్దు! 6ఎందువల్లనంటే సర్యశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు! ‘కొద్ది వ్యవధిలో మరొక్కసారి పరలోకాలను, భూమిని, సముద్రాన్ని, ఎండిన నేలను కంపించేలా చేస్తాను. 7దేశాలన్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలోవున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఈ ఆలయాన్ని మహిమతో నింపుతాను.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. 8‘వెండి నాది. బంగారంనాది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. 9‘ఈ ప్రస్తుత ఆలయంయొక్క మహిమ మొదటి ఆలయ మహిమకంటె ఇనుమడించి ఉంటుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. ‘మరియు ఈ ప్రదేశంలో నేను శాంతి నెలకొల్పుతాను అని’ సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు!”
పని ప్రారంభమయింది — ఆశీస్సులు వస్తాయి
10దర్యావేషు కాలంలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజున దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ఇలా వినవచ్చింది: 11“సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ధర్మశాస్త్రం వీటిని గురించి ఏమి చెపుతున్నదో ఇప్పుడు యాజకులను అడుగు. 12‘ఒకడు తన వస్త్రముల మడతలో పవిత్ర బలి మాంసాన్ని పెట్టుకుని వెళ్లాడనుకో. పవిత్ర మాంసాన్ని ఉంచిన తన వస్త్రం రొట్టెనుగాని, వండిన ఆహారాన్నిగాని, ద్రాక్షారసం, నూనె లేక ఇతర తినుబండారాలనుగాని తాకిందనుకో. అలా ముట్టబడిన పదార్థం పవిత్రమౌతుందా?’ అని”
యాజకులు “కాదు” అని సమాధానమిచ్చారు.
13పిమ్మట హగ్గయి అన్నాడు: “ఒకడు శవాన్ని ముట్టాడనుకో. అతడు అపవిత్రుడవుతాడు. అతడు గనుక దేన్నయినా ముట్టుకుంటే ఆ వస్తువు అపవిత్రమౌతుందా?”
“అది అపవిత్రమౌతుంది” అని యాజకులు సమాధానమిచ్చారు.
14పిమ్మట హగ్గయి చెప్పాడు: “దేవుడైన యెహోవా ఇలా చెవుతున్నాడు: ‘ఈ జనులకు సంబంధించినంతవరకూ ఆ విషయం కూడా నిజమే. వాళ్లు నా ముందు అపరిశుద్ధులు, అపవిత్రులు. వాళ్ల చేతులతో తాకినవన్నీ అపరిశుద్ధమైనవి.
15“‘యెహోవా ఆలయపు పని ప్రారంభించేందుకు ముందు జరిగిన సంగతుల విషయమై ఆలోచించు. 16ప్రజలు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం మాత్రమే కుప్పలో ఉంది. ద్రాక్షారసం ఏభై కొలలు తీసికోటానికి ఒక తొట్టివద్దకు రాగా, వారికి ఇరవై కొలలు మాత్రమే దొరికేవి. 17ఎందుకంటే నేను మిమ్మల్ని, మీ చేతులు చేసిన వస్తువులను శిక్షించాను. మొక్కలను చీడలతోను, బూజుతోనూ, మిమ్మల్ని వడగండ్లతోను శిక్షించాను. అయినా మీరు నా వద్దకు రాలేదు.’ దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు.
18“‘ఈ రోజు తొమ్మిదవ నెలలో ఇరవైనాల్గవ దినం. మీరు యెహోవా ఆలయానికి పునాది వేయటం ముగించారు. కావున ఈ రోజునుండి ఏమి జరుగుతుందో చూడండి. 19గోదాముల్లో ధాన్యం నిలవవుందా? ద్రాక్షాలతలు, అంజూరపుచెట్లు, దానిమ్మ చెట్లు ఇంకను పండ్లనీయటం లేదా? (లేదు). అయితే నేను మిమ్మల్ని ఈ రోజునుండి ఆశీర్వదిస్తాను!’”
20మళ్లీ తొమ్మిదవనెల, ఇరవై నాలుగవరోజు రెండవ సారి దేవుడైన యెహోవా వాక్కు హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది: 21“జెరుబ్బాబెలుకు చెప్పు: పరలోకాన్ని, భూమిని కదుపుతాను. 22రాజ్యాల సింహాసనాలను తల్లక్రిందులు చేస్తాను. ఆ ఇతర రాజ్యాలవారిని నాశనం చేస్తాను. రథాలను, వాటిమీద ఉన్నవారిని పడదోస్తాను. గుర్రాలు, రౌతులు కూలిపోతారు. ఆ సైన్యాలు ప్రస్తుతం మిత్రులు. కానివాళ్లు ఒకరికొకరు ప్రతికూలులై, కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకొంటారు.” 23సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. “షయల్తీయేలు కుమారుడవు, నా సేవకుడవునైన జెరుబ్బాబెలూ, నిన్ను నేను ఎన్నుకొన్నాను. దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ఆ సమయాన నేను నిన్నొక ముద్ర వేసే ఉంగరంగా#2:23 ముద్ర వేసే ఉంగరము నేనీ పనులు చేశానని చెప్పడానికి నీవే ఒక ఋజువు. చేస్తాను. (ఈ పనులు నేను చేశానని మీరే ఋజువు.)”
సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు.

Marker

Kopier

Sammenlign

Del

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på