మత్తయి సువార్త 28

28
యేసు పునరుత్థానము
1సబ్బాతు దినం తర్వాత, వారం మొదటి రోజున, తెల్లవారేటప్పుడు మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.
2అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చింది, ఎందుకంటే పరలోకం నుండి ప్రభువు దూత దిగి వచ్చి, సమాధి దగ్గరకు వెళ్లి, ఆ రాయిని వెనుకకు దొర్లించి దాని మీద కూర్చున్నాడు. 3ఆ దూత రూపం మెరుపులా, అతని బట్టలు మంచులా తెల్లగా ఉన్నాయి. 4ఆ కావలివారు దూతను చూసి భయంతో వణికి చచ్చిన వారిలా పడిపోయారు.
5దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, మీరు సిలువవేయబడిన, యేసును వెదకుతున్నారు అని నాకు తెలుసు. 6ఆయన ఇక్కడ లేరు; తాను చెప్పినట్లే, ఆయన లేచారు. రండి ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. 7త్వరగా వెళ్లి ఆయన శిష్యులతో, ‘యేసు మృతులలో నుండి లేచారు, ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. అక్కడ మీరు ఆయనను చూస్తారు’ అని చెప్పండి. నేను మీతో చెప్పింది జ్ఞాపకముంచుకోండి” అన్నాడు.
8ఆ స్త్రీలు భయపడినప్పటికీ గొప్ప ఆనందంతో, యేసు శిష్యులకు ఆ సమాచారం చెప్పడానికి సమాధి నుండి త్వరగా పరుగెత్తి వెళ్లారు. 9అకస్మాత్తుగా యేసు వారిని కలిశారు. ఆయన వారికి “శుభములు” అని చెప్పారు. వారు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాలను పట్టుకుని ఆయనను ఆరాధించారు. 10యేసు వారితో, “భయపడకండి, మీరు వెళ్లి నా సహోదరులను గలిలయకు వెళ్లుమని చెప్పండి; అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారికి చెప్పారు.
కావలివారి నివేదిక
11ఆ స్త్రీలు మార్గంలో ఉండగానే, సమాధి దగ్గర ఉన్న కావలివారిలో కొంతమంది పట్టణంలోనికి వెళ్లి, జరిగిన విషయాలన్నిటిని ముఖ్య యాజకులతో చెప్పారు. 12ముఖ్య యాజకులు యూదా పెద్దలతో కలసి ఆలోచించి, ఆ సైనికులకు చాలా డబ్బు లంచంగా ఇచ్చి, 13“మేము నిద్రపోతున్నప్పుడు, ‘రాత్రి సమయంలో యేసు శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారు’ అని చెప్పండి. 14ఒకవేళ ఇది అధిపతికి తెలిసినా, మేము అతనికి చెప్పి మీకు ఏ ప్రమాదం కలుగకుండా చూస్తాము” అని వారికి మాట ఇచ్చారు. 15కాబట్టి సైనికులు ఆ డబ్బు తీసుకుని వారితో చెప్పిన ప్రకారం చేశారు. ఈ కథ ఇప్పటికీ యూదులలో చాలా వ్యాపించి ఉంది.
గొప్ప ఆదేశం
16ఆ పదకొండు మంది శిష్యులు యేసు తమకు చెప్పినట్లే, గలిలయలోని కొండకు వెళ్లారు. 17వారు ఆయనను చూసినప్పుడు, ఆయనను ఆరాధించారు గాని కొందరు సందేహించారు. 18యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. 19కాబట్టి మీరు వెళ్లి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మమిస్తూ, అన్ని దేశాలను#28:19 లేదా సర్వ జనాంగాలు శిష్యులుగా చేసి, 20నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని, వారు పాటించాలని మీరు వారికి బోధించండి. గుర్తుంచుకోండి, నేను యుగాంతం వరకు, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను” అని వారితో చెప్పారు.

ハイライト

シェア

コピー

None

すべてのデバイスで、ハイライト箇所を保存したいですか? サインアップまたはサインインしてください。