నిర్గమ 39
39
యాజక వస్త్రాలు
1పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి నీలం ఊదా ఎరుపు రంగుల నూలు ఉపయోగించి వారు నేసిన వస్త్రాలను తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు పవిత్ర వస్త్రాలను కూడా తయారుచేశారు.
ఏఫోదు
2బంగారంతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో ఏఫోదును తయారుచేశారు. 3నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో నైపుణ్యమైన పనిగా నేయడానికి బంగారాన్ని రేకులుగా సాగగొట్టి దానిని తీగెలుగా కత్తిరించారు. 4ఏఫోదుకు భుజాల ముక్కలు తయారుచేసి అది కదలకుండా ఉండేలా దాని రెండు మూలల్లో కూర్చారు. 5నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా, బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.
6వారు లేతపచ్చ రాళ్లు తీసుకుని చెక్కేవారు ముద్రను చెక్కినట్లు వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కి బంగారు జరీ చట్రంలోకి ఎక్కించి, 7తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.
రొమ్ము కవచం
8నైపుణ్యం ఉట్టిపడేలా ఏఫోదును చేసినట్లు బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో పతకాన్ని తయారుచేశారు. 9అది చతురస్రంగా జానెడు#39:9 అంటే, సుమారు 23 సెం.మీ. పొడవు జానెడు వెడల్పుతో రెండుగా మడత పెట్టబడి ఉంది. 10దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం; 11రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, పచ్చ; 12మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం; 13నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి#39:13 ఈ విలువైన రాళ్లలో కొన్నిటిని ఖచ్చితంగా గుర్తించడం అనిశ్చితము. ఉన్నాయి. వాటిని బంగారు చట్రంలో అమర్చారు. 14ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉన్నాయి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడ్డాయి.
15వారు రొమ్ము పతకానికి స్వచ్ఛమైన బంగారంతో ఒక తాడులా అల్లికపనితో గొలుసులు చేశారు. 16రెండు బంగారు జరీ పలకలు రెండు బంగారు ఉంగరాలను చేసి, వాటిని పతకానికి రెండు చివర్లకు తగిలించారు. 17వారు రొమ్ము పతకం చివరిలో ఉన్న ఉంగరాలకు రెండు బంగారు గొలుసులు బిగించి, 18గొలుసుల యొక్క ఇతర చివరలను రెండు జవలకు, ముందు భాగంలో ఉన్న ఏఫోదు యొక్క భుజాలకు జోడించారు. 19వారు రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి, వాటిని ఏఫోదు ముందు భాగంలో రొమ్ము పతకానికి లోపలి అంచున ఉన్న రెండు చివర్లకు జోడించారు. 20వారు మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించారు. 21యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు, రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టారు.
ఇతర యాజక వస్త్రాలు
22వారు ఏఫోదు నిలువుటంగీని ఒక నేత పనిలా పూర్తిగా నీలి బట్టతో తయారుచేసి, 23దాని మధ్యలో తల దూర్చడానికి రంధ్రం చేసి అది చిరిగిపోకుండా మెడపట్టీలా#39:23 హెబ్రీ భాషలో ఈ పదానికి ఖచ్చితమైన అర్థం తెలియదు దాని అంచుల చుట్టూ అల్లికపని చేశారు. 24వారు ఆ వస్త్రం అంచు చుట్టూ నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో పాటు, పేనిన సన్నని నారతో దానిమ్మపండ్లు తయారుచేశారు. 25స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన గంటలను వస్త్రం అంచు చుట్టూ ఉన్న దానిమ్మపండ్ల మధ్య తగిలించారు. 26సేవ చేస్తున్నప్పుడు వేసుకోడానికి బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉంచారు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
27వారు అహరోనుకు అతని కుమారులకు సన్నని నారబట్టతో చొక్కా నేసారు. 28సన్నని నారతో తలపాగా, నార టోపీలు, పేనిన సన్నని నారతో లోదుస్తులు చేశారు. 29పేనిన సన్నని నారతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో బుటా పనిగా నడికట్టు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
30వారు పవిత్ర చిహ్నంగా స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటం తయారుచేసి, దాని మీద ముద్రలా ఈ మాటలు చెక్కారు:
పరిశుద్ధత యెహోవాకే.
31దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.
సమావేశ గుడారాన్ని పరిశీలిస్తున్న మోషే
32సమావేశ గుడారపు పనంతా పూర్తి అయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేశారు. 33అప్పుడు వారు సమావేశ గుడారం మోషే దగ్గరకు తెచ్చారు:
గుడారం దాని అలంకరణలు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;
34ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మాల పైకప్పు, మన్నికైన తోళ్ల#39:34 బహుశ పాలిచ్చే పెద్ద నీటి జంతువుల తోళ్ళు పైకప్పు, కప్పివుంచే తెర;
35నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత;
36బల్ల, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు;
37మేలిమి బంగారు దీపస్తంభం, దాని దీపాల వరుస, దాని ఉపకరణాలన్నీ, వెలిగించడానికి ఒలీవనూనె;
38బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ద్వారానికి తెర;
39ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు దాని పాత్రలన్నీ;
ఇత్తడి గంగాళం, దాని పీట;
40ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర;
ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు;
సమావేశ గుడారంలో సేవకు ఉపయోగించే అన్ని ఉపకరణాలు;
41పరిశుద్ధాలయంలో పరిచర్య చేయడానికి ధరించే నేసిన వస్త్రాలు; యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవ చేస్తున్నప్పుడు అతని కుమారులకు వస్త్రాలు.
42యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పని అంతా పూర్తి చేశారు. 43మోషే వారు చేసిన పనిని పరిశీలించి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు దానిని చేశారని చూశాడు. కాబట్టి మోషే వారిని దీవించాడు.
Zur Zeit ausgewählt:
నిర్గమ 39: TSA
Markierung
Kopieren
Vergleichen
Teilen
Möchtest du deine gespeicherten Markierungen auf allen deinen Geräten sehen? Erstelle ein kostenloses Konto oder melde dich an.
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.