అపొస్తలుల కార్యములు 20
20
మాసిదోనియా ప్రాంతం నుండి గ్రీసు దేశానికి వెళ్లుట
1ఆ అల్లరంతా తగ్గిన తర్వాత, పౌలు శిష్యులను తన దగ్గరకు పిలుచుకొని, వారిని ధైర్యపరచి వారి దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియకు బయలుదేరాడు. 2అతడు ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ప్రజలను ధైర్యపరచే మాటలను చెప్పుతూ, చివరికి గ్రీసు దేశం చేరాడు. 3అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తర్వాత, ఓడ ఎక్కి సిరియా దేశానికి బయదేరుతున్నప్పుడు, కొందరు యూదులు అతని మీద కుట్ర పన్నుతున్నారని తెలుసుకొని మాసిదోనియా గుండా తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకొన్నాడు. 4అతనితో బెరయా పట్టణస్థుడు పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణస్థుడైన అరిస్తర్కు సెకుందు, దెర్బే పట్టణస్థుడైన గాయి, తిమోతి, తుకికు ఆసియా ప్రాంతం నుండి త్రోఫిము అనేవారు ఉన్నారు. 5వీరందరు మాకంటే ముందుగా త్రోయ పట్టణం చేరుకొని మాకోసం ఎదురు చూస్తున్నారు. 6కానీ మేము పులియని రొట్టెల పండుగ తర్వాత మాసిదోనియలోని ఫిలిప్పీ పట్టణం నుండి ఓడ ఎక్కి బయలుదేరి, అయిదు రోజుల తర్వాత మిగిలిన వారిని త్రోయ పట్టణంలో కలుసుకొని వారి దగ్గర ఏడు రోజులు గడిపాము.
త్రోయా పట్టణంలో చనిపోయిన ఐతుకును బ్రతికించుట
7వారం మొదటి రోజున రొట్టె విరవడం కోసం మేము ఒక్కచోట చేరినప్పుడు, పౌలు మరుసటిరోజు వెళ్లిపోవాలి, కాబట్టి వారితో అర్థరాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. 8మేము సమావేశమైన మేడ గదిలో చాలా దీపాలు ఉన్నాయి. 9ఆ గది కిటికీ మీద ఐతుకు అనే పేరుగల ఒక యవ్వనస్థుడు కూర్చుని ఉన్నాడు, పౌలు ఇంకా మాట్లాడుతుండగా వాడు మత్తు నిద్రలోకి వెళ్లిపోయాడు. వాడు బాగా నిద్రలోకి వెళ్లినప్పుడు, వాడు మూడవ అంతస్తు నుండి క్రింద నేలపై పడి చనిపోయాడు. 10అప్పుడు పౌలు క్రిందికి వెళ్లి, ఆ యువకుని మీద పడి, తన చేతులతో కౌగిలించుకుని, “మీరు కంగారుపడకండి, ఇతడు ప్రాణంతో ఉన్నాడు” అని వారితో చెప్పాడు. 11అతడు మళ్ళీ మేడ గదికి వెళ్లి వారందరితో కలిసి రొట్టెను విరిచి తిన్నాడు. అతడు తెల్లవారే వరకు వారితో మాట్లాడి బయలుదేరి వెళ్లాడు. 12ఆ యువకుని సజీవంగా ఇంటికి తీసుకుని వెళ్లిన ప్రజలందరు గొప్ప ఆదరణ పొందారు.
ఎఫెసు సంఘపెద్దల దగ్గర సెలవు తీసుకున్న పౌలు
13పౌలును ఎక్కించుకోవాలని, మేము ఓడలో ముందుగా బయలుదేరి అస్సోసు చేరిపోయాము. పౌలు అక్కడికి కాలినడకన రావాలని ఈ ఏర్పాటును చేశాడు. 14అనుకున్న విధంగానే అతడు మమ్మల్ని అస్సోసులో కలుసుకున్నాడు, మేము అతన్ని మితులేనేకు తీసుకుని వెళ్లాము. 15మరుసటిరోజు మేము అక్కడినుండి ఓడలో బయలుదేరి కీయోసు చేరి, మరుసటిరోజు సమొసును దాటి, ఆ తర్వాత రోజు మిలేతు చేరుకొన్నాము. 16పెంతెకొస్తు పండుగ రోజు యెరూషలేములో ఉండాలని పౌలు ఆతురతలో ఉన్నాడు కాబట్టి, అతడు ఆసియా ప్రాంతంలో సమయం వ్యర్థం చేయకూడదని ఎఫెసు పట్టణం దాటి పోవడానికి నిర్ణయించుకొన్నాడు.
17పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు. 18వారు వచ్చినపుడు, వారితో ఈ విధంగా చెప్పాడు: “నేను ఆసియా ప్రాంతానికి వచ్చిన మొదటి రోజు నుండి మీతో గడిపిన సమయమంతటిలో నేను ఎలా జీవించానో మీకు తెలుసు. 19నాకు విరోధంగా యూదులు చేసిన కుట్రల వలన నేను ఎదుర్కొన్న శ్రమల మధ్యలో కూడా నేను కన్నీరు విడుస్తు, మిక్కిలి వినయంగా ప్రభువును సేవించాను. 20మీకు ఉపయోగకరమైన దానిని సంకోచించకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి బోధించానని మీకు తెలుసు. 21పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి ప్రభువైన యేసును నమ్మమని యూదులకు గ్రీసు దేశస్థులకు నేను ప్రకటించాను.
22“ఇప్పుడు, నేను ఆత్మ చేత బలవంతం చేయబడి, నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమి జరుగబోతుందో తెలియదు. 23ప్రతి పట్టణంలో నా కోసం సంకెళ్ళు హింసలు వేచి ఉన్నాయని, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు. 24అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెమును పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది.
25“నేను మీ మధ్య తిరుగుతూ దేవుని రాజ్యం గురించి ప్రకటించాను కానీ మీలో ఎవరూ మళ్ళీ నన్ను చూడరని నాకు తెలుసు. 26మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని అని నేడు మీ ముందు ప్రకటిస్తున్నాను. 27ఎందుకంటే, దేవుని ఉద్దేశమంతటిని మీకు ప్రకటించడానికి నేను సంకోచించలేదు. 28అయితే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకుంటూ పరిశుద్ధాత్మ మీకు అప్పగించిన మందను సంఘపెద్దలుగా కాయండి. దేవుడు తన స్వరక్తాన్ని క్రయధనంగా చెల్లించి కొన్న ఆయన సంఘానికి కాపరులుగా ఉండండి. 29నేను వెళ్లిన తర్వాత, భయంకరమైన తోడేళ్ళు మీ మధ్యకు చొరబడతాయి, అవి మందను విడిచిపెట్టవని నాకు అర్థమవుతుంది. 30శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవడానికి సత్యాన్ని మళ్ళించే వారు మీ సొంతవారిలో నుండే బయలుదేరుతారు. 31కాబట్టి మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో అందరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి.
32“ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి, మిమ్మల్ని అభివృద్ధిపరచి పరిశుద్ధులందరితో పాటు మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వగల ఆయన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను. 33నేను ఎవరి వెండిని కాని బంగారం కాని వస్త్రాలను కాని ఆశించలేదు. 34నా సొంత చేతులతో నా అవసరాలను, నాతో ఉన్న వారి అవసరాలను తీర్చానని మీకే తెలుసు. 35నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘తీసుకోవడంకంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను” అని చెప్పాడు.
36పౌలు మాట్లాడటం ముగించిన తర్వాత, అతడు వారందరితో కలిసి మోకరించి ప్రార్థించాడు. 37వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు. 38మీరు మరలా ఎన్నడు నా ముఖం చూడరు అని అతడు చెప్పిన మాట వారికి చాలా దుఃఖం కలిగించింది. ఆ తర్వాత వారు అతన్ని ఓడ వరకు సాగనంపారు.
Právě zvoleno:
అపొస్తలుల కార్యములు 20: TSA
Zvýraznění
Sdílet
Kopírovat
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.