Logo YouVersion
Ikona vyhledávání

అపొస్తలుల కార్యములు 12

12
చెరసాల నుండి పేతురు అద్భుతంగా తప్పించబడుట
1ఆ దినాల్లో రాజైన హేరోదు సంఘానికి చెందిన కొందరిని హింసించాలని ఉద్దేశించి వారిని బంధించాడు. 2అలా రాజు, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. 3ఈ విషయాన్ని యూదులు అంగీకరించడం చూసిన హేరోదు పేతురును కూడా బంధించాడు. అది పులియని రొట్టెల పండుగ సమయంలో జరిగింది. 4హేరోదు పేతురును పట్టుకుని చెరసాలలో వేయించి, నలుగురేసి సైనికులుండే నాలుగు సైనిక దళాలను అతనికి కాపలాగా నియమించాడు. పస్కా పండుగ తర్వాత ప్రజల ముందు అతన్ని విచారణకు తీసుకురావాలని హేరోదు భావించాడు.
5కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. కానీ సంఘం అతని కోసం దేవునికి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు.
6హేరోదు అతన్ని విచారణకు తీసుకురావడానికి ముందు రాత్రి, పేతురు రెండు గొలుసులతో బంధించబడి, ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. అలాగే కావలివారు చెరసాల తలుపు ముందు కాపలా కాస్తున్నారు. 7అప్పుడు, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు, కాబట్టి ఆ గదిలో వెలుగు ప్రకాశించింది. అప్పుడా దూత పేతురు ప్రక్కన తట్టి, “త్వరగా లే” అని చెప్పాడు. అప్పుడు పేతురు చేతులకున్న ఆ గొలుసులు తెగిపడ్డాయి.
8అప్పుడు ఆ దూత అతనితో, “నీ బట్టలు చెప్పులు వేసుకో” అని చెప్పాడు. పేతురు అలాగే చేశాడు. దూత అతనితో, “నీ చుట్టూ వస్త్రాన్ని చుట్టుకొని నన్ను వెంబడించు” అని చెప్పాడు. 9పేతురు ఆ దూతను వెంబడిస్తూ చెరసాల బయటకు వచ్చాడు, దూత చేసేదంతా నిజంగా జరుగుతుంది అన్న ఆలోచనే అతనికి లేదు; తాను ఒక దర్శనం చూస్తున్నానని భావించాడు. 10వారు మొదటి, రెండవ కావలివారిని దాటి పట్టణంలోనికి దారితీసే ఇనుప ద్వారం దగ్గరకు వచ్చారు. ఆ ద్వారం దానంతట అదే తెరచుకుంది, కాబట్టి వారు దానిగుండా వెళ్లారు. వారు ఒక వీధిని దాటిన తర్వాత, అకస్మాత్తుగా ఆ దూత అతన్ని విడిచిపోయాడు.
11అప్పుడు పేతురు జరిగిందంతా నిజం అని తెలుసుకొని, “ప్రభువు తన దూతను పంపించి హేరోదు చేతి నుండి యూదులు తనకు చేయాలనుకున్నవేవి జరుగకుండా తప్పించాడని, ఏ సందేహం లేకుండా ఇప్పుడు నాకు తెలిసిందని” తనలో తాను అనుకున్నాడు.
12దీనిని గ్రహించిన తర్వాత, అతడు మార్కు అనబడే యోహాను తల్లియైన మరియ ఇంటికి వెళ్లాడు, అక్కడ చాలామంది విశ్వాసులు చేరి ప్రార్థన చేస్తున్నారు. 13పేతురు బయటి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టాడు, అప్పుడు రోదె అనే పేరుగల ఒక సేవకురాలు తలుపు తీయడానికి వచ్చింది. 14ఆమె పేతురు స్వరాన్ని గుర్తుపట్టి, అత్యంత సంతోషంతో తలుపు తీయకుండానే వెనుకకు పరుగెత్తుకొని వెళ్లి, “పేతురు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు!” అని కేక వేసి చెప్పింది.
15వారు ఆమెతో, “నీకు పిచ్చి పట్టింది” అన్నారు. ఆమె అది నిజమని పట్టుబడుతూవుంటే వారు, “అది అతని దూతయై ఉండవచ్చు” అన్నారు.
16కానీ పేతురు తలుపు తట్టుతూనే ఉన్నాడు, వారు తలుపు తీసినప్పుడు అక్కడ పేతురును చూసి ఆశ్చర్యపడ్డారు. 17పేతురు, నెమ్మదిగా ఉండండని చేతితో సైగ చేసి ప్రభువు అతన్ని చెరసాలలో నుండి ఎలా బయటకు తీసుకుని వచ్చాడో వారికి వివరించాడు. “యాకోబుకు, ఇతర సహోదరి సహోదరులందరికి కూడా ఈ సంగతిని తెలియజేయండి” అని చెప్పి, అక్కడినుండి మరొక చోటికి వెళ్లాడు.
18తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికుల్లో చాలా గందరగోళం కలిగింది. 19హేరోదు పేతురు కోసం ఎంత వెదకినా కనబడలేదు, కాబట్టి అతడు కావలివారిని విచారించి, వారిని చంపమని ఆదేశించాడు.
హేరోదు మరణం
ఆ తర్వాత హేరోదు యూదయ ప్రాంతం నుండి కైసరయ పట్టణానికి వెళ్లి అక్కడ నివసించాడు. 20హేరోదు తూరు సీదోను పట్టణస్థులతో జగడమాడుతూ ఉండేవాడు; ఇప్పుడు వారంతా కలిసి రాజుతో మాట్లాడాలని భావించారు. వారు ఆహార సరఫరా కోసం హేరోదు రాజ్యం మీద ఆధారపడ్డారు, కాబట్టి రాజు యొక్క నమ్మకమైన వ్యక్తిగత సేవకుడైన బ్లాస్తు అనే వాని మద్ధతు పొందిన తర్వాత, పరిస్థితిని సమాధానపరచమని అడిగారు.
21నిర్ణయించబడిన రోజున హేరోదు, రాజ వస్త్రాలను ధరించుకొని, తన సింహాసనం మీద కూర్చుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు. 22అప్పుడు ప్రజలు, “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు. 23వెంటనే, హేరోదు దేవునికి ఘనత ఇవ్వని కారణంగా, ప్రభువు దూత అతన్ని కొట్టగా, అతడు పురుగులుపడి చనిపోయాడు.
24కానీ దేవుని వాక్యం అంతకంతకు వ్యాపిస్తూ ఉండింది.
బర్నబా సౌలు
25బర్నబా సౌలులు తమ పని ముగించిన తర్వాత, మార్కు అనబడే యోహానును వెంటబెట్టుకొని, యెరూషలేముకు తిరిగి వెళ్లారు.

Zvýraznění

Sdílet

Kopírovat

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas