Logo YouVersion
Ikona vyhledávání

1 యోహాను పత్రిక 4

4
మోసపరచు ఆత్మలను తిరస్కరించుట
1ప్రియ మిత్రులారా, అబద్ధ ప్రవక్తలు చాలామంది లోకంలో బయలుదేరారు, కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకుండా, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. 2దేవుని ఆత్మను మనం ఈ విధంగా గుర్తించవచ్చు: యేసు క్రీస్తు మానవ శరీరాన్ని ధరించి వచ్చారని ఒప్పుకునే ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చిందే. 3అయితే యేసు దేవుని నుండి వచ్చారని ఒప్పుకొనని ప్రతి ఆత్మ దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధి ఆత్మ. అది వస్తున్నదని మీరు విన్నారు కాని ఇప్పటికే అది లోకంలోనికి వచ్చి ఉన్నది.
4ప్రియ బిడ్డలారా, మీరు దేవునికి చెందినవారు; మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించారు. 5వారు లోకానికి చెందినవారు కాబట్టి లోకరీతిగా మాట్లాడతారు, లోకం వారి మాటలు వింటుంది. 6కాని మనం దేవునికి చెందినవారం, దేవుని ఎరిగిన ప్రతి ఒకరు మన మాటలు వింటారు. దేవునికి చెందనివారు మన మాటలు వినరు. కాబట్టి సత్యమైన ఆత్మను అబద్ధపు ఆత్మను దీనిని బట్టి మనకు తెలుస్తుంది.
దేవుని ప్రేమ, మన ప్రేమ
7ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి వస్తుంది కాబట్టి మనం ఒకరిని ఒకరం ప్రేమించాలి. ప్రేమించేవారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వారు దేవున్ని ఎరిగినవారు. 8దేవుడే ప్రేమ, కాబట్టి ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. 9ఆయన ద్వారా మనం జీవించగలిగేలా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. ఈ విధంగా దేవుడు మన మధ్య తన ప్రేమను చూపించారు. 10మనం దేవుడిని ప్రేమించామని కాదు కాని ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా తన కుమారుని పంపారు. ఇదే ప్రేమంటే. 11ప్రియ మిత్రులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి. 12దేవుడిని ఎవరూ ఎన్నడూ చూడలేదు; కాని మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తే, దేవుడు మనలో జీవిస్తారు; ఆయన ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది.
13మనం ఆయనలో జీవిస్తున్నామని ఆయన మనలో ఉన్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది: ఆయన తన ఆత్మను మనకు ఇచ్చారు. 14లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపడం మనం మేము చూశాం సాక్ష్యమిచ్చాము. 15యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో, వారిలో దేవుడు, వారు దేవునిలో జీవిస్తారు. 16దేవునికి మనపై ఉన్న ప్రేమను తెలుసుకొని మనం దానిపైన ఆధారపడుతున్నాము.
దేవుడే ప్రేమ. ఎవరు ప్రేమ కలిగి జీవిస్తారో, వారు దేవునిలో, దేవుడు వారిలో జీవిస్తారు. 17తీర్పు రోజున మనం ధైర్యంతో ఉండేలా దేవుని ప్రేమ మనలో ఈ విధంగా పరిపూర్ణం చేయబడింది: ఈ లోకంలో మనం యేసు వలె ఉన్నాము. 18ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తరిమివేస్తుంది, ఎందుకంటే భయం అనేది శిక్షకు సంబంధించింది. కాబట్టి భయపడేవారు ప్రేమలో పరిపూర్ణం కాలేరు.
19ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాము. 20అయితే ఎవరైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ తన సహోదరుని సహోదరిని ద్వేషించేవారు అబద్ధికులు. తాము చూస్తున్న తన సహోదరుని లేదా సహోదరిని ప్రేమించలేనివారు తాము చూడని దేవుని కూడా ప్రేమించలేరు. 21కాబట్టి దేవుని ప్రేమించే ప్రతివారు తమ సహోదరుని సహోదరిని కూడ ప్రేమించాలి అనేదే క్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ.

Zvýraznění

Kopírovat

Porovnat

Sdílet

None

Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas