1 కొరింథీ పత్రిక 3
3
సంఘం, దాని నాయకులు
1సహోదరీ సహోదరులారా, ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్లు మీతో నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే మీరు ఇంకా ఈ లోక సంబంధులుగానే జీవిస్తూ క్రీస్తులో పసిబిడ్డలుగానే ఉన్నారు. 2మీరు బలమైన ఆహారాన్ని తినడానికి సిద్ధంగా లేరు కాబట్టి నేను మీకు పాలు ఇచ్చాను. ఇప్పుడు కూడా మీరు దానికి సిద్ధంగా లేరు. 3మీరు ఇంకా లోకస్థులుగానే ఉన్నారు. మీలో అసూయ, కొట్లాటలు ఉన్నాయి. కాబట్టి మీరు శరీర స్వభావంతో సాధారణ మానవుల్లా జీవించడం లేదా? 4మీలో, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని ఒకరు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని ఇంకొకరు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీరు సాధారణ మానవుల్లా లేరా?
5అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? కేవలం సేవకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు నియమించిన దాని ప్రకారం, వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు. 6నేను విత్తనం నాటాను, అపొల్లో దానికి నీళ్లు పోశాడు, అయితే వృద్ధి కలుగచేసింది దేవుడే. 7కాబట్టి నాటేవారిలో కానీ, నీళ్లు పోసేవారిలో కానీ గొప్పతనం ఏమి లేదు, కానీ దేవుడే దానిని వృద్ధి చేయగలరు. 8నాటేవారు, నీళ్లు పోసేవారు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు తాను చేసిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. 9కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు.
10దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేశాను. అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్టాలి. 11ఎందుకంటే అప్పటికే వేయబడిన పునాది తప్ప మరొకటి ఎవరూ వేయలేరు, ఆ పునాది యేసు క్రీస్తే. 12ఎవరైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డి లాంటి వస్తువులతో కడితే, 13ఆ న్యాయ దినాన వారు చేసిన పని వెలుగులో స్పష్టంగా కనబడుతుంది. అది అగ్నిచేత నిరూపించబడుతుంది, అందరి పనిలోని నాణ్యత అగ్నిచేత పరీక్షించబడుతుంది. 14పునాది మీద కట్టిన పని ఎవరిది నిలుస్తుందో, వారు జీతాన్ని పొందుతారు. 15అది కాల్చి వేయబడితే దానిని కట్టిన వారికి నష్టం కలుగుతుంది కానీ వారు తప్పించుకుంటారు. అయితే అది కేవలం మంటల్లో నుండి తప్పించుకున్నట్లుగా ఉంటారు.
16మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా? 17ఎవరైనా దేవుని మందిరాన్ని పాడు చేస్తే, దేవుడు వారిని పాడుచేస్తారు. ఎందుకంటే దేవుని మందిరం పరిశుద్ధమైనది. మీరందరు కలిసి ఆ ఆలయమై ఉన్నారు.
18మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ఈ లోకరీతిగా, మీలో ఎవరైనా నేను జ్ఞానినని అనుకుంటే, వారు జ్ఞాని అవ్వడానికి “బుద్ధిలేనివారిగా” కావాలి. 19ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము. లేఖనాల్లో: “జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు”#3:19 యోబు 5:13 అని వ్రాయబడి ఉంది. 20లేఖనాల్లో ఇంకొక చోట: “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవి అని దేవునికి తెలుసు”#3:20 కీర్తన 94:11 అని వ్రాయబడి ఉంది. 21కాబట్టి ఎవరు మనుష్యులను బట్టి గర్వించకూడదు. అన్ని మీకు చెందినవే. 22పౌలు అయినా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడు ఉన్న వాటిలోనైనా, రాబోయే వాటిలోనైనా అన్ని మీకు చెందినవే. 23మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవారు.
Právě zvoleno:
1 కొరింథీ పత్రిక 3: TSA
Zvýraznění
Kopírovat
Porovnat
Sdílet
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.