విలాప 3
3
# 3 ఈ అధ్యాయం ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి 1యెహోవా ఉగ్రత కర్ర చేత
నేను బాధను అనుభవించిన వాన్ని.
2ఆయన నన్ను వెళ్లగొట్టి,
వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు.
3నిజానికి, ఆయన రోజంతా
మాటిమాటికి నా మీద తన చేయి ఆడిస్తానే ఉన్నారు.
4ఆయన నా చర్మాన్ని, నా మాంసాన్ని క్షీణించిపోయేలా చేసి
నా ఎముకలను విరగ్గొట్టారు.
5ఆయన నన్ను ముట్టడించి,
విషంతో కఠినత్వంతో నన్ను చుట్టుముట్టారు.
6ఎప్పుడో చనిపోయినవారు పడి ఉన్నట్లుగా
ఆయన నన్ను చీకటిలో పడి ఉండేలా చేశారు.
7నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు;
బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు.
8నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా
ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు.
9ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు;
ఆయన నా మార్గాలను వంకర చేశారు.
10పొంచి ఉన్న ఎలుగుబంటిలా,
దాక్కున్న సింహంలా,
11ఆయన నన్ను దారిలో నుండి ఈడ్చుకెళ్లి, నన్ను ముక్కలు చేసి,
నిస్సహాయ స్థితిలో వదిలేశారు.
12ఆయన తన విల్లు తీసి,
తన బాణాలకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.
13ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో,
నా గుండెను గుచ్చారు.
14నేను నా ప్రజలందరికి నవ్వులాటగా మారాను;
రోజంతా వారు పాటలో నన్ను హేళన చేస్తున్నారు.
15ఆయన నాతో చేదు మూలికలు తినిపించారు,
త్రాగడానికి చేదు పానీయాన్ని ఇచ్చారు.
16ఆయన రాళ్లతో నా పళ్లను విరగ్గొట్టారు;
నన్ను దుమ్ములో త్రొక్కారు.
17సమాధానం నాకు దూరమైంది,
అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను.
18కాబట్టి, “నా వైభవం పోయింది,
యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను.
19నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి,
నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి.
20నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను,
నా ప్రాణం నాలో కృంగి ఉంది.
21అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను,
కాబట్టి నాకు నిరీక్షణ ఉంది:
22యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు,
ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.
23ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి;
మీ నమ్మకత్వం గొప్పది.
24నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం;
కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను”
అని అనుకుంటున్నాను.
25తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి,
తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు;
26యెహోవా రక్షణ కోసం
ఓపికతో వేచి ఉండడం మంచిది.
27ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే,
కాడి మోయడం అతనికి మేలు.
28యెహోవాయే దాన్ని అతని మీద ఉంచారు,
కాబట్టి అతడు ఒంటరిగా మౌనంగా కూర్చోవాలి.
29అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు
ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు.
30తనను కొట్టేవానికి తన చెంపను చూపించి,
నిండా అవమానం పాలుకానివ్వు.
31ఎవ్వరూ ప్రభువుచేత
శాశ్వతంగా త్రోసివేయబడరు.
32ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు,
ఆయన మారని ప్రేమ చాలా గొప్పది.
33ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని
దుఃఖం గాని కలుగజేయరు.
34దేశంలో ఖైదీలందరిని,
కాళ్లక్రింద పడేసి త్రొక్కాలని,
35మహోన్నతుని ఎదుట,
ప్రజలు తమ హక్కులను త్రోసిపుచ్చాలని,
36ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం,
ఇలాంటివి ప్రభువు చూడరా?
37ప్రభువు శాసించనప్పుడు
అది జరిగేలా ఎవరు ఆజ్ఞాపించగలరు?
38మహోన్నతుని నోటి నుండి
వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా?
39తమ పాపాలను బట్టి శిక్షించబడినప్పుడు
సజీవులైన మనుష్యులు ఎందుకు ఫిర్యాదు చేయాలి?
40మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి,
యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.
41మన హృదయాలను, చేతులను
పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి:
42“మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము
మీరు క్షమించలేదు.
43“మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు;
మీరు జాలి లేకుండా చంపారు.
44ఏ ప్రార్థన ఫలించకుండా,
మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు.
45దేశాల మధ్య
మీరు మమ్మల్ని చెత్తగా చేశారు.
46“మా శత్రువులందరూ మాకు వ్యతిరేకంగా
నోరు తెరిచారు.
47మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము,
పతనము నాశనము.”
48నా ప్రజలు నాశనమయ్యారు కాబట్టి
నా కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తాయి.
49-50యెహోవా పరలోకం నుండి
క్రిందికి వంగి చూసే వరకు,
ఉపశమనం లేకుండా,
నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది.
51నా నగర స్త్రీలందరి వల్ల
నేను చూసేది నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తుంది.
52కారణం లేకుండా నాకు శత్రువులుగా ఉన్నవారు
పక్షిలా నన్ను వేటాడారు.
53వారు గొయ్యిలో వేసి నా ప్రాణం తీయాలని చూశారు,
నాపై రాళ్లు విసిరారు;
54నీరు నా తలపై మూసుకుపోయాయి,
నేను నశిస్తానని అనుకున్నాను.
55యెహోవా, నీ నామమున మొరపెట్టాను,
గొయ్యి లోతుల్లో నుండి నీ నామాన్ని పిలిచాను.
56“మీరు నా మొరను ఆలకించారు,
నీ చెవులు మూసుకోకు”
అనే నా విన్నపాన్ని మీరు విన్నారు.
57నేను నిన్ను పిలిచినప్పుడు మీరు దగ్గరికి వచ్చి
“భయపడకు” అన్నారు.
58ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు.
నీవు నా ప్రాణాన్ని విమోచించావు.
59యెహోవా చూశావు.
నా కారణాన్ని సమర్థించండి!
60వారి ప్రతీకార తీవ్రతను,
నాకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్రలన్నీ మీరు చూశారు.
61యెహోవా, వారి అవమానాలను,
నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు.
62నా శత్రువులు రోజంతా నాకు వ్యతిరేకంగా
గుసగుసలాడే గొణుగుతున్నారు.
63వాటిని చూడు! కూర్చున్నా, నిలబడినా
తమ పాటల్లో నన్ను వెక్కిరిస్తారు.
64యెహోవా వారి క్రియా కలపలను బట్టి,
ప్రతీకారం చేస్తావు.
65వారికి కాఠిన్యమైన హృదయాలు ఇవ్వండి,
మీ శాపం వారి మీదికి వచ్చును గాక.
66కోపంతో వారిని వెంటాడి,
యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి.
S'ha seleccionat:
విలాప 3: TSA
Subratllat
Copia
Compara
Comparteix
Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.