Logo de l'Aplicació de la Bíblia
Icona de cerca

యెహెజ్కేలు 41

41
ఆలయ పవిత్ర స్థలం
1ఆ మనిషి నన్ను మధ్య గదికి (పవిత్ర స్థలం) తీసుకొని వచ్చాడు. అతడు దానికి రెండు ప్రక్కలనున్న గోడలను కొలిచాడు. అవి ప్రతి ప్రక్క పది అడుగుల ఆరంగుళాల మందాన ఉన్నాయి. 2తలుపు పది మూరల వెడల్పు ఉంది. ద్వారపు ప్రక్క భాగాలు ప్రతి ప్రక్కా ఐదు మూరలు ఉన్నాయి. ఆ మనిషి గదిని కొలిచాడు. అది నలభై మూరల పొడవు, ఇరవై మూరల వెడల్పు ఉంది.
ఆలయ అతి పవిత్ర స్థలం
3పిమ్మట ఆ మనిషి లోపలి చివరి గదికి వెళ్లి ద్వారం ప్రక్క గోడలను కొలిచాడు. ప్రతిగోడా రెండు మూరల మందం, ఏడు మూరల వెడల్పు ఉంది. తలుపు మధ్య ఆరు మూరల ప్రవేశ స్థలం ఉంది. 4తరువాత ఆ మనిషి గది యొక్క పొడవు కొలిచాడు. అది మధ్య గదిలో ప్రవేశించే ఇరవై మూరల పొడవు, ఇరవై మూరల వెడల్పు కలిగి ఉంది. అతను నాతో, “ఇది అతి పవిత్ర స్థలం” అని చెప్పాడు.
ఆలయం చుట్టూవున్న వేరే గదులు
5పిమ్మట అతడు ఆలయపు గోడను కొలిచాడు. అది ఆరు మూరల మందం కలిగి ఉంది. ప్రక్క గదులు ఆలయం చుట్టూ ఉన్నాయి. అవి నాలుగు మూరల వెడల్పు. 6ప్రక్క గదులు మూడు వివిధ అంతస్థులపై ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి అవి ఉన్నాయి. ప్రతి అంతస్థులోను ముప్పయి గదులున్నాయి. ఆలయపు గోడలు రాళ్ళ తిప్పలతో కట్టబడ్డాయి. ప్రక్క గదులకు చుట్టూ గోడ ఆధారం ఉంది. కానీ కేవలం ఆలయం యొక్క గోడే గదులకు ఆధారం కాలేదు. 7ఆలయం చుట్టూ ఉన్న గదుల ప్రతి అంతస్ధూ దానిక్రింది భాగం కంటె వెడల్పుగా ఉంది. ఆలయం చుట్టూ ఉన్న గదుల గోడలు పైకి పోను పోనూ ఇరుకు కావడం వల్ల పై అంతస్థుల గదులు విశాలంగా ఉన్నాయి. క్రింది అంతస్థు నుండి పై అంతస్థు వరకు మధ్య అంతస్తుగుండా మెట్లదారి ఉంది.
8ఆలయానికి చుట్టూ చదును చేసి బండలు పరచిన ఎత్తయిన పునాది ఉన్నట్లు నేను చూశాను. ప్రక్క గదుల పునాదులు పది అడుగుల ఆరంగుళాల ఎత్తున ఉన్నాయి. 9ప్రక్క గదుల బయటి గోడ ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాల మందం ఉంది. ఆలయం ప్రక్క గదులకు, యాజకుల గదులకు మధ్య మరియు 10ఆలయం చుట్టూ ఖాళీ స్థలం ముప్పయి ఐదు అడుగులు. 11ప్రక్క గదుల వాకిళ్ళు ఎత్తయిన పునాది స్థలం వరకూ ఉన్నాయి. ఒక వాకిలి ఉత్తర దిశగా ఉంటే, మరొకటి దక్షిణ దిశగా ఉంది.
12ఆలయానికి పడమట నియమిత స్థలంలో ఒక భవనం ఉంది. అది డెభ్బై మూరల వెడల్పు, తొంభై మూరల పొడవు కలిగి ఉంది. ఆ భవనపుగోడ ఆన్ని వైపులా ఐదు మూరల మందం ఉంది. 13పిమ్మట ఆ మనుష్యుడు ఆలయాన్ని కొలిచాడు. ఆలయం నూరు మూరల పొడవుంది. భవనం, నియమిత స్థలం, దాని గోడలతో కలిసి పొడవు నూరు మూరలున్నాయి. 14ఆలయం ముందు తూర్పు భాగపు నియమిత స్థలం నూరు మూరల పొడవుంది.
15ఆలయపు చివరి నియమిత స్థలంలో ఉన్న భవనం పొడవును ఆ మనిషి కొలిచాడు. ఒక గోడకు మరొక గోడకు నూరు మూరలున్నవి.
అతి పవిత్ర స్థలానికి, పవిత్ర స్థలానికి, మండపానికి ఎదురుగా ఉన్న ఆవరణ చుట్టూ మూడింటి గోడలకు నగిషీ పనులు చేసిన కొయ్యపలకలు అన్ని కిటికీలకు, తలుపులకు కొయ్యతో నగిషీలు చెయబడ్డాయి. 16ఆలయపు గుమ్మం వద్ద క్రింది నుండి కిటికీల వరకు చుట్టూ బల్ల కూర్పువేయబడింది.
17ఆలయపు లోపలి, బయటి గదుల గోడలలో నగిషీలు చేయబడ్డాయి. ఆలయం యొక్క లోపలి గది గోడల మీద, బయట గది గోడల మీద 18కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి. కెరూబుల మధ్య ఒక ఖర్జూరపు చెట్టు చొప్పున ఉన్నాయి. ప్రతీ కెరూబునకు రెండు ముఖాలు ఉన్నాయి. 19ఒకటి మానవ ముఖం ఆకారంలో ఉండి ఒక ప్రక్క నున్న ఖర్జూరపు చెట్టు వైపు చూస్తూ ఉంటుంది. రెండవది సింహపు ముఖం. అది రెండవ ప్రక్కనున్న ఖర్జూరపు చెట్టును చూస్తూ ఉంటుంది. అవి ఆలయం మీద అన్ని చోట్లా చెక్కబడ్డాయి. 20నేలనుండి తలుపు మీది వరకూ గల పవిత్ర స్థల గోడల మీద కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి.
21ఆలయపు పవిత్ర స్థలం ఇరు ప్రక్కలనున్న గోడలు చదరంగా ఉన్నాయి. అతి పవిత్ర స్థలం ముందు 22కొయ్యతో చేయబడిన బలిపీఠం వంటిది ఒకటుంది. అది మూడు మూరల ఎత్తు, రెండు మూరల పొడవు కలిగి ఉంది. దాని మూలలు, దాని అడుగు, దాని ప్రక్కలు అన్నీ కొయ్యతోనే చేయబడ్డాయి. “ఇది యెహోవా ఎదుట ఉండే బల్ల” అని ఆ మనుష్యుడు నాతో ఇలా చెప్పాడు.
23పవిత్ర స్థలం మరియు అతి పవిత్ర స్థలం రెండింటికీ రెండు తలుపులున్నాయి. 24తలుపులలో ప్రతి ఒక్కటి రెండు చిన్న తలుపులతో చేయబడింది. ప్రతి తలుపుకి నిజానికి రెండు మడత తలుపులున్నాయి. 25పవిత్రమైన గది తలుపుల మీద కూడ కెరూబుల, ఖర్జూరపు చెట్ల చిత్రాలు చెక్కబడ్డాయి. అవి గోడల మీద చెక్కిన చిత్రాల మాదిరిగానే ఉన్నాయి. మండపానికి ముందు భాగం చెక్కలతో కప్పబడి ఉంది. 26మండపం చుట్టూ దాని మేడ మీద గదులలో కొయ్యతో చేయబడ్డ చట్రపు కిటికీలు, మండపానికి ఇరు ప్రక్కల ఖర్జూరపు చెట్లు ఉన్నాయి.

Subratllat

Copia

Compara

Comparteix

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió