దానియేలు 10

10
హిద్దెకెలు నది దగ్గర దానియేలు దర్శనము
1పారసీక రాజగు కోరెషు పాలన మూడవ సంవత్సరంలో, బెల్తెషాజరు అను దానియేలుకు ఒక విషయం తెలియపర్చబడింది. అది యుద్ధమును గూర్చిన నిజ సంగతి. ఇది దర్శనం ద్వారా దానియేలుకు బయలుపడింది గనుక అతడు గ్రహించాడు.
2ఆ దినాల్లో దానియేలు అను నేను మూడు వారాలు దుఃఖాక్రాంతుడనయ్యాను. 3ఆ మూడు వారాల్లో, నేను ఎలాంటి పుష్ఠికరమైన ఆహారాన్ని భుజించలేదు, మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, తలకు నూనె రాసుకోలేదు.
4మొదటి నెల ఇరవై నాల్గవ రోజున, గొప్ప నది అయిన టైగ్రిసు (హిద్దెకెలు) నది గట్టుమీద నేను నిలబడి ఉన్నాను. 5నేనక్కడ నిలబడి కన్నులెత్తి చూస్తూండగా ఒక వ్యక్తి నార బట్టలు ధరించుకొని, నడుము చుట్టూ మేలిమి బంగారపు దట్టి ధరించుకొని యున్నాడు. 6ఆయన శరీరం గోమేధికంవలె పసుపుగాను, ముఖం మెరుపువలె ప్రకాశవంతంగాను, కళ్లు ప్రకాశిస్తున్న దీపాలవలె కనిపించానియి చేతులూ, కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్దం నర సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి.
7దానియేలు అను నేనొక్కడనే ఆ దర్శనం చూశాను. నా వెంటనున్న మనుష్యులు ఆ దర్శనం చూడలేదు. కాని వారు భయంతో వణుకుచూ పారిపోయి దాగుకొన్నారు. 8అందువల్ల నేను ఒంటరి వాడనై, ఆ గొప్ప దర్శనాన్ని చూచి, నాలో బలము లేనివాడనయ్యాను. మృతుడైనవాని ముఖంవలె నా ముఖం పాలిపోయి బలంలేని వాడనయ్యాను. 9దర్శనంలో కనిపించిన వ్యక్తి మాటలాడడం విన్నాను. అతను మాటలాడడం వినగా, నేను గాఢనిద్ర పొందిన వాడనై నేలమీద సాష్టాంగ పడ్డాను.
10అప్పుడు ఒకని చెయ్యి నన్ను తాకి, వణకుచున్న నా చేతులను, మోకాళ్లను బలపరచి నన్ను నిలువ బెట్టింది. 11అతడు నాతో, “బహు ప్రియుడవైన దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము. సరిగా నిలువబడు. నేను నీ కోసమే నీ యొద్దకు పంపబడ్డాను” అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను. 12అప్పుడు అతడు నాతో, “దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థిస్తూంన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను. 13పారసీక రాజ్యాధిపతి ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి పతియొద్ద విడిచి వచ్చాను. 14అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంబధించింది” అని చెప్పాడు.
15అతడు అలా మాటలాడుతూ ఉండగా, నా ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉండిపోయాను. 16మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులు తాకాడు. నేను నా నోరు తెరిచి, మాటలాడటానికి ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, “అయ్యా, దర్శనంలో కనిపించిన వాటివల్ల బాధనొంది బలము లేని వాడనయ్యాను. 17అయ్యా! నీ సేవకుడనైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలంపోయింది. నాకు ఊపిరి ఆడనట్లయింది” అని అన్నాను.
18మానవునిలా కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ నన్ను ముట్టి, బలపరిచాడు. 19అతడు నాతో, “బహు ప్రియుడవయిన మనుష్యుడా! భయపడవద్దు. నీకు శాంతి కలుగునుగాక! శక్తివంతుడవై ధైర్యంగా ఉండు” అని అన్నాడు.
అతడు మాటలాడగానే నేను బలం పొంది ఇలాగన్నాను: “అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు. ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును.”
20అప్పుడు అతను, “దానియేలూ, నేను ఎందుకు నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు. 21సత్య గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది నేను నీకు చెపుతాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు తప్ప మరి యెవ్వరూ నా పక్షంగా నిలబడరు.

Subratllat

Copia

Compara

Comparteix

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió