నిర్గమకాండము 4:18-31 - Compare All Versions
నిర్గమకాండము 4:18-31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ తర్వాత మోషే తన మామయైన యెత్రో దగ్గరకు తిరిగివెళ్లి అతనితో, “నేను ఈజిప్టులో ఉన్న నా బంధువుల దగ్గరకు తిరిగివెళ్లి వారిలో ఎవరైనా ఇంకా బ్రతికి ఉన్నారో లేదో చూడడానికి నన్ను వెళ్లనివ్వు” అన్నాడు. అందుకు యెత్రో, “సమాధానం కలిగి, వెళ్లు” అన్నాడు. తర్వాత యెహోవా మిద్యానులో మోషేతో, “నిన్ను చంపడానికి చూసినవారందరు చనిపోయారు కాబట్టి నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లు” అన్నారు. కాబట్టి మోషే తన భార్య పిల్లలను తీసుకుని గాడిద మీద ఎక్కించి ఈజిప్టుకు తిరిగి ప్రయాణమయ్యాడు. అతడు దేవుని కర్రను తన చేతిలో పట్టుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లిన తర్వాత, నేను నీకు చేయడానికి శక్తినిచ్చిన ఇచ్చిన అద్భుతాలన్నిటిని ఫరో ఎదుట నీవు చేయాలి. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను కాబట్టి అతడు ప్రజలను వెళ్లనివ్వడు. అప్పుడు నీవు ఫరోతో, ‘యెహోవా నాతో ఇలా చెప్పారు: ఇశ్రాయేలు నా మొదటి సంతానమైన కుమారుడు, “నన్ను సేవించేలా నా కుమారుని వెళ్లనివ్వు” అని నీకు చెప్పాను. కాని నీవు వారిని పంపడానికి నిరాకరించావు; కాబట్టి నేను నీ మొదటి సంతానమైన నీ కుమారున్ని చంపుతాను.’ ” ప్రయాణ మార్గంలో వారు బసచేసిన చోటు దగ్గర యెహోవా మోషేను ఎదుర్కొని అతన్ని చంపబోయారు. అయితే సిప్పోరా ఒక చెకుముకి కత్తిని తీసుకుని, తన కుమారుని యొక్క మర్మాంగ చర్మం యొక్క కొనను కత్తిరించుట ద్వార సున్నతిచేసి, దానితో మోషే పాదాలను తాకించి, “నీవు నాకు రక్తసంబంధమైన భర్తవు” అన్నది. అప్పుడు యెహోవా అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు “రక్తసంబంధమైన భర్తవయ్యావు” అన్నది. యెహోవా అహరోనుతో, “మోషేను కలవడానికి అరణ్యంలోనికి వెళ్లు” అని అన్నారు. కాబట్టి అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు మోషే తనను పంపించిన యెహోవా చెప్పమన్న వాటన్నిటిని, ఆయన తనను చేయమని ఆజ్ఞాపించిన సూచనలన్నింటిని గురించి అహరోనుకు చెప్పాడు. అప్పుడు మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి, యెహోవా మోషేకు చెప్పిన వాటన్నిటిని అహరోను పెద్దలందరికి తెలియజేశాడు. మోషే వారి ఎదుట ఆ అసాధారణమైన సూచకక్రియలను చేశాడు, అప్పుడు వారు నమ్మారు. యెహోవా ఇశ్రాయేలీయులను పట్టించుకున్నాడని తమ బాధలను చూశాడని విని వారు తమ తలలు వంచి ఆరాధించారు.
నిర్గమకాండము 4:18-31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. “నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను” అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్ళి రమ్మని పంపించాడు. అప్పుడు యెహోవా మిద్యానులో ఉన్న మోషేతో “నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్లు” అని చెప్పాడు. మోషే తన భార్యబిడ్డలను వెంటబెట్టుకుని గాడిదపై కూర్చోబెట్టి ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. తనతోబాటు దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు. అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవాపెద్ద కొడుకు. నన్ను సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక వారిని వెళ్ళనియ్యకపోతే నేను నీ కొడుకును, నీ పెద్ద కొడుకును చంపేస్తాను అని యెహోవా చెబుతున్నాడు’ అని అతనితో చెప్పాలి” అన్నాడు. ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు. మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడేసింది. “నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి” అని చెప్పింది. అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె “ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు” అంది. మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు మోషే యెహోవా తనను పంపిన సంగతిని చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి అహరోనుకు తెలియజేశాడు. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు ప్రజల పెద్దలందరినీ సమావేశ పరిచారు. మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుటా అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు. యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.
నిర్గమకాండము 4:18-31 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మోషే తన మామ యిత్రో ఇంటికి తిరిగి వెళ్లాడు. “ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను మళ్లీ వెళతాను, నన్ను పోనివ్వండి. వాళ్లు ఇంకా బతికే ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి” అని యిత్రోతో చెప్పాడు మోషే. “నీవు సమాధానంగా వెళ్లొచ్చు” అన్నాడు యిత్రో మోషేతో. తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే దేవుడు మోషేతో, “ఇప్పుడు నీవు మళ్లీ ఈజిప్టు వెళ్లడం నీకు క్షేమం. నిన్ను చంపాలని చూస్తున్న వాళ్లు ఇప్పుడు చనిపోయారు” అని చెప్పాడు. కనుక మోషే తన భార్యను, తన కొడుకును బయల్దేరదీసి గాడిదల మీద ఎక్కించాడు. తిరిగి ఈజిప్టు దేశానికి ప్రయాణం కట్టాడు. దేవుని శక్తిగల తన కర్రను మోషే తనతో తీసుకొని వెళ్లాడు. మోషే ఈజిప్టుకు ప్రయాణం చేస్తూండగా దేవుడు అతనితో మాట్లాడాడు: “నీవు ఫరోతో మాట్లాడేటప్పుడు నీవు ఏమేమి అద్భుతాలు చేసేందుకు నీకు శక్తి ఇచ్చానో వాటన్నింటినీ చేయాలని జ్ఞాపకం ఉంచుకో! అయితే నేను మాత్రం ఫరో ఇంకా మొండికెత్తేటట్లు చేస్తాను. అతడు ప్రజల్ని వెళ్లనియ్యడు. అప్పుడు నీవు ఫరోతో ‘ఇశ్రాయేలు నా ప్రథమ సంతానంగా పుట్టిన కుమారుడు. నా కుమారుడు వెళ్లి నన్ను ఆరాధించనివ్వు అని నేను నీతో చెబుతున్నాను. నీవే గనుక ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వకపోతే, నీ పెద్ద కుమారుణ్ణి నేను చంపేస్తాను.’” అని యెహోవా అనుచున్నాడని అతనితో చెప్పెను. మోషే ఈజిప్టుకు తన ప్రయాణం కొనసాగించాడు. నిద్రపోవాలని అతడు ఒక సత్రములో ఆగాడు. అక్కడ దేవుడు మోషేను కలుసుకొని అతణ్ణి చంపదలచాడు. కాని సిప్పోర పదునైన ఒక కత్తి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. ఆ చర్మం పట్టుకొని ఆమె అతని పాదాలను తాకింది. అప్పుడు ఆమె (మోషేతో) “నీవు రక్త సంబంధమైన భర్తవు అని అంది” సిప్పోర తన కుమారునికి సున్నతి చేసినందువల్ల ఇలా చెప్పింది. అందుచేత దేవుడు మోషేను క్షమించాడు (అతణ్ణి చంపలేదు). యెహోవా అహరోనుతో, “అరణ్యంలోకి వెళ్లి మోషేను కలుసుకో” అని చెప్పాడు. కనుక అహరోను వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొన్నాడు. అహరోను మోషేను చూడగానే అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. దేవుడు తనతో చెప్పినదంతా మోషే అహరోనుతో చెప్పాడు. దేవుడు తనను ఎందుకు పంపిందీ, అహరోనుతో చెప్పాడు మోషే. అలాగే అతను చేయాల్సిన అద్భుతాలు, చూపాల్సిన రుజువులు అన్నింటిని మోషే అహరోనుకు వివరించాడు. అందుచేత మోషే, అహరోనూ వెళ్లి ఇశ్రాయేలు పెద్దలందర్నీ సమావేశం చేసారు. అప్పుడు ఆ ప్రజలతో వారు మాట్లాడారు. యెహోవా మోషేతో చెప్పిన విషయాలన్నీ అతడు వాళ్లతో చెప్పాడు. అప్పుడు వాళ్లందరూ చూచేటట్టు మోషే అద్భుతాలు చేసి రుజువు చేసాడు. దేవుడు మోషేను పంపించాడని ఆ ప్రజలు నమ్మారు. ఇశ్రాయేలీయులకు సహాయం చేసేందుకు దేవుడు వచ్చాడని తెలిసి ఆ ప్రజలు దేవుని ముందర తలలు వంచుకొని ఆరాధించారు. వారి కష్టాలను దేవుడు చూసాడని తెలిసి వాళ్లు దేవుడ్ని ఆరాధించారు.
నిర్గమకాండము 4:18-31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లి–సెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో–క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను. అంతట యెహోవా–నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేతపట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు. అప్పుడు నీవు ఫరోతో–ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు; నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంపనొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి–నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటి వైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె–ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను. మరియు యెహోవా–మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలనుచేయగా జనులు నమ్మిరి. మరియు–యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.