నిర్గమకాండము 4:18-31
నిర్గమకాండము 4:18-31 TERV
అప్పుడు మోషే తన మామ యిత్రో ఇంటికి తిరిగి వెళ్లాడు. “ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను మళ్లీ వెళతాను, నన్ను పోనివ్వండి. వాళ్లు ఇంకా బతికే ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి” అని యిత్రోతో చెప్పాడు మోషే. “నీవు సమాధానంగా వెళ్లొచ్చు” అన్నాడు యిత్రో మోషేతో. తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే దేవుడు మోషేతో, “ఇప్పుడు నీవు మళ్లీ ఈజిప్టు వెళ్లడం నీకు క్షేమం. నిన్ను చంపాలని చూస్తున్న వాళ్లు ఇప్పుడు చనిపోయారు” అని చెప్పాడు. కనుక మోషే తన భార్యను, తన కొడుకును బయల్దేరదీసి గాడిదల మీద ఎక్కించాడు. తిరిగి ఈజిప్టు దేశానికి ప్రయాణం కట్టాడు. దేవుని శక్తిగల తన కర్రను మోషే తనతో తీసుకొని వెళ్లాడు. మోషే ఈజిప్టుకు ప్రయాణం చేస్తూండగా దేవుడు అతనితో మాట్లాడాడు: “నీవు ఫరోతో మాట్లాడేటప్పుడు నీవు ఏమేమి అద్భుతాలు చేసేందుకు నీకు శక్తి ఇచ్చానో వాటన్నింటినీ చేయాలని జ్ఞాపకం ఉంచుకో! అయితే నేను మాత్రం ఫరో ఇంకా మొండికెత్తేటట్లు చేస్తాను. అతడు ప్రజల్ని వెళ్లనియ్యడు. అప్పుడు నీవు ఫరోతో ‘ఇశ్రాయేలు నా ప్రథమ సంతానంగా పుట్టిన కుమారుడు. నా కుమారుడు వెళ్లి నన్ను ఆరాధించనివ్వు అని నేను నీతో చెబుతున్నాను. నీవే గనుక ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వకపోతే, నీ పెద్ద కుమారుణ్ణి నేను చంపేస్తాను.’” అని యెహోవా అనుచున్నాడని అతనితో చెప్పెను. మోషే ఈజిప్టుకు తన ప్రయాణం కొనసాగించాడు. నిద్రపోవాలని అతడు ఒక సత్రములో ఆగాడు. అక్కడ దేవుడు మోషేను కలుసుకొని అతణ్ణి చంపదలచాడు. కాని సిప్పోర పదునైన ఒక కత్తి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. ఆ చర్మం పట్టుకొని ఆమె అతని పాదాలను తాకింది. అప్పుడు ఆమె (మోషేతో) “నీవు రక్త సంబంధమైన భర్తవు అని అంది” సిప్పోర తన కుమారునికి సున్నతి చేసినందువల్ల ఇలా చెప్పింది. అందుచేత దేవుడు మోషేను క్షమించాడు (అతణ్ణి చంపలేదు). యెహోవా అహరోనుతో, “అరణ్యంలోకి వెళ్లి మోషేను కలుసుకో” అని చెప్పాడు. కనుక అహరోను వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొన్నాడు. అహరోను మోషేను చూడగానే అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. దేవుడు తనతో చెప్పినదంతా మోషే అహరోనుతో చెప్పాడు. దేవుడు తనను ఎందుకు పంపిందీ, అహరోనుతో చెప్పాడు మోషే. అలాగే అతను చేయాల్సిన అద్భుతాలు, చూపాల్సిన రుజువులు అన్నింటిని మోషే అహరోనుకు వివరించాడు. అందుచేత మోషే, అహరోనూ వెళ్లి ఇశ్రాయేలు పెద్దలందర్నీ సమావేశం చేసారు. అప్పుడు ఆ ప్రజలతో వారు మాట్లాడారు. యెహోవా మోషేతో చెప్పిన విషయాలన్నీ అతడు వాళ్లతో చెప్పాడు. అప్పుడు వాళ్లందరూ చూచేటట్టు మోషే అద్భుతాలు చేసి రుజువు చేసాడు. దేవుడు మోషేను పంపించాడని ఆ ప్రజలు నమ్మారు. ఇశ్రాయేలీయులకు సహాయం చేసేందుకు దేవుడు వచ్చాడని తెలిసి ఆ ప్రజలు దేవుని ముందర తలలు వంచుకొని ఆరాధించారు. వారి కష్టాలను దేవుడు చూసాడని తెలిసి వాళ్లు దేవుడ్ని ఆరాధించారు.

