నిర్గమ 4:18-31
నిర్గమ 4:18-31 IRVTEL
ఇది జరిగిన తరువాత మోషే తన మామ యిత్రో దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. “నువ్వు అనుమతి ఇస్తే నేను ఐగుప్తులో ఉన్న నా జనుల దగ్గరికి వెళ్తాను, వాళ్ళింకా బతికి ఉన్నారో లేదో చూసి వస్తాను” అన్నాడు. యిత్రో క్షేమంగా వెళ్ళి రమ్మని పంపించాడు. అప్పుడు యెహోవా మిద్యానులో ఉన్న మోషేతో “నిన్ను చంపాలని చూసిన వాళ్ళంతా చనిపోయారు. కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్లు” అని చెప్పాడు. మోషే తన భార్యబిడ్డలను వెంటబెట్టుకుని గాడిదపై కూర్చోబెట్టి ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. తనతోబాటు దేవుని కర్రను చేతబట్టుకుని వెళ్ళాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “నీవు ఐగుప్తుకు చేరిన తరువాత చేయడానికి నేను నీకిచ్చిన అద్భుత కార్యాలు ఫరో సమక్షంలో చెయ్యాలి, అయితే నేను అతని హృదయం కఠినం చేస్తాను. అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడు. అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు యెహోవా సంతానం. యెహోవాపెద్ద కొడుకు. నన్ను సేవించడానికి నా కుమారుణ్ణి వెళ్ళనిమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గనక వారిని వెళ్ళనియ్యకపోతే నేను నీ కొడుకును, నీ పెద్ద కొడుకును చంపేస్తాను అని యెహోవా చెబుతున్నాడు’ అని అతనితో చెప్పాలి” అన్నాడు. ప్రయాణం మధ్యలో వారు బస చేసినప్పుడు యెహోవా వారిని ఎదుర్కొని మోషేను చంపడానికి చూశాడు. మోషే భార్య సిప్పోరా ఒక పదునైన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసి మర్మాంగ చర్మం కొన మోషే పాదాల దగ్గర పడేసింది. “నువ్వు నిజంగా నా రక్తసంబంధమైన భర్తవి” అని చెప్పింది. అప్పుడు యెహోవా అతణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు ఆమె “ఈ సున్నతిని బట్టి నువ్వు నాకు రక్తసంబంధమైన భర్తవయ్యావు” అంది. మోషేను కలుసుకోవడానికి ఎడారికి వెళ్ళమని యెహోవా అహరోనుతో చెప్పాడు. అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకుని అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు మోషే యెహోవా తనను పంపిన సంగతిని చెప్పమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఆజ్ఞాపించిన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి అహరోనుకు తెలియజేశాడు. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు ప్రజల పెద్దలందరినీ సమావేశ పరిచారు. మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుటా అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు. యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.

