నిర్గమ 4:18-31

నిర్గమ 4:18-31 TSA

ఆ తర్వాత మోషే తన మామయైన యెత్రో దగ్గరకు తిరిగివెళ్లి అతనితో, “నేను ఈజిప్టులో ఉన్న నా బంధువుల దగ్గరకు తిరిగివెళ్లి వారిలో ఎవరైనా ఇంకా బ్రతికి ఉన్నారో లేదో చూడడానికి నన్ను వెళ్లనివ్వు” అన్నాడు. అందుకు యెత్రో, “సమాధానం కలిగి, వెళ్లు” అన్నాడు. తర్వాత యెహోవా మిద్యానులో మోషేతో, “నిన్ను చంపడానికి చూసినవారందరు చనిపోయారు కాబట్టి నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లు” అన్నారు. కాబట్టి మోషే తన భార్య పిల్లలను తీసుకుని గాడిద మీద ఎక్కించి ఈజిప్టుకు తిరిగి ప్రయాణమయ్యాడు. అతడు దేవుని కర్రను తన చేతిలో పట్టుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో అన్నారు, “నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్లిన తర్వాత, నేను నీకు చేయడానికి శక్తినిచ్చిన ఇచ్చిన అద్భుతాలన్నిటిని ఫరో ఎదుట నీవు చేయాలి. అయితే నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను కాబట్టి అతడు ప్రజలను వెళ్లనివ్వడు. అప్పుడు నీవు ఫరోతో, ‘యెహోవా నాతో ఇలా చెప్పారు: ఇశ్రాయేలు నా మొదటి సంతానమైన కుమారుడు, “నన్ను సేవించేలా నా కుమారుని వెళ్లనివ్వు” అని నీకు చెప్పాను. కాని నీవు వారిని పంపడానికి నిరాకరించావు; కాబట్టి నేను నీ మొదటి సంతానమైన నీ కుమారున్ని చంపుతాను.’ ” ప్రయాణ మార్గంలో వారు బసచేసిన చోటు దగ్గర యెహోవా మోషేను ఎదుర్కొని అతన్ని చంపబోయారు. అయితే సిప్పోరా ఒక చెకుముకి కత్తిని తీసుకుని, తన కుమారుని యొక్క మర్మాంగ చర్మం యొక్క కొనను కత్తిరించుట ద్వార సున్నతిచేసి, దానితో మోషే పాదాలను తాకించి, “నీవు నాకు రక్తసంబంధమైన భర్తవు” అన్నది. అప్పుడు యెహోవా అతన్ని విడిచిపెట్టారు. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు “రక్తసంబంధమైన భర్తవయ్యావు” అన్నది. యెహోవా అహరోనుతో, “మోషేను కలవడానికి అరణ్యంలోనికి వెళ్లు” అని అన్నారు. కాబట్టి అతడు వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు మోషే తనను పంపించిన యెహోవా చెప్పమన్న వాటన్నిటిని, ఆయన తనను చేయమని ఆజ్ఞాపించిన సూచనలన్నింటిని గురించి అహరోనుకు చెప్పాడు. అప్పుడు మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగు చేసి, యెహోవా మోషేకు చెప్పిన వాటన్నిటిని అహరోను పెద్దలందరికి తెలియజేశాడు. మోషే వారి ఎదుట ఆ అసాధారణమైన సూచకక్రియలను చేశాడు, అప్పుడు వారు నమ్మారు. యెహోవా ఇశ్రాయేలీయులను పట్టించుకున్నాడని తమ బాధలను చూశాడని విని వారు తమ తలలు వంచి ఆరాధించారు.

నిర్గమ 4:18-31 కోసం వీడియో