ఎస్తేరు 2:5-11 - Compare All Versions

ఎస్తేరు 2:5-11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ సమయంలో షూషను కోటలో బెన్యామీను గోత్రానికి చెందిన కీషుకు పుట్టిన షిమీ యొక్క కుమారుడైన యాయీరుకు పుట్టిన మొర్దెకై అనే యూదుడు ఉండేవాడు, బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నుండి చెరకు తీసుకెళ్లిన యూదా రాజైన యెహోయాకీనుతో పాటు ఉన్నవారిలో ఇతడు ఉన్నాడు. మొర్దెకై యొక్క పినతండ్రి యొక్క కుమార్తె, హదస్సా అనే బంధువు ఉన్నది, ఆమెకు తల్లిదండ్రులు లేనందుకు అతడే ఆమెను పెంచాడు. ఎస్తేరు అని కూడ పిలువబడే ఈ యువతి మంచి రూపం కలిగి, అందంగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై ఆమెను తన సొంత కుమార్తెగా దత్తత తీసుకున్నాడు. రాజు ఆజ్ఞ అంతా ప్రకటించబడింది, చాలామంది యువతులను, షూషను కోటకు తెచ్చారు, హేగై అనే ఆ అంతఃపురం యొక్క అధికారి ఆధీనంలో వారిని ఉంచారు, ఎస్తేరును కూడా రాజభవనానికి తీసుకెళ్లి హేగైకు అప్పగించారు. ఎస్తేరు అతనికి నచ్చింది, దయ పొందుకుంది. వెంటనే పరిమళద్రవ్యాలు ఆమెకు అందించి, ప్రత్యేక ఆహారం ఆమెకు ఏర్పాటు చేశాడు. అతడు ఆమె కోసం రాజభవనం నుండి ఏర్పరచబడిన ఏడుగురు స్త్రీ పరిచారకులను నియమించాడు, ఆమెను, ఆమె పరిచారకులను అంతఃపురంలోని శ్రేష్ఠమైన స్థలంలోనికి పంపించాడు. ఎస్తేరు తన జాతిని, తన కుటుంబ నేపధ్యాన్ని బయలుపరచలేదు, ఎందుకంటే అవి చెప్పకూడదని మొర్దెకై ఆమెకు ఆదేశించాడు. ఎస్తేరు ఎలా ఉందో, ఆమె క్షేమం తెలుసుకోవడానికి మొర్దెకై ప్రతిరోజు అంతఃపురం ఆవరణం దగ్గరే అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TSA

ఎస్తేరు 2:5-11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశికుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను బందీగా కొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చిన వాడు. అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారు పేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి. చూడ చక్కని ముఖవర్చస్సు గలది. ఆమె తలిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు. రాజ శాసనం, ఆజ్ఞ ప్రకటించడం అయిన తరువాత చాలామంది కన్యలను తెచ్చి షూషను కోటలో ఉంచారు. వారినందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వశంలో ఉంచారు. ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమె పైన దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనాలను, భోజనపదార్ధాలను ఏర్పరచాడు. రాజుగారి దివాణంలో నుంచి ఏడుగురు ఆడపిల్లలను ఆమెకు చెలికత్తెలుగా ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె చెలికత్తెలను రాణివాసంలో అతి శ్రేష్ఠమైన స్థలం లో ఉంచాడు. తన బంధువులెవరో తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తెలపవద్దని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు. ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికీ ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండడానికీ మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినం తిరుగులాడుతూ ఉండేవాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 IRVTEL

ఎస్తేరు 2:5-11 TERV (పవిత్ర బైబిల్)

రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రి కీషు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను బందీగా పట్టుకొన్నాడు యెరూషలేము నుంచి చెరపట్టబడినవారిలో మొర్దెకై కూడా ఒకడు. హదస్సా అనే ఒక అమ్మాయి వుంది. ఆమె మొర్దెకైకి పినతండ్రి కూతురు. ఆమె తల్లితండ్రులు మరణించినప్పుడు, మొర్దకై ఆమెని చేరదీసి, తన స్వంత కూతురులా పెంచి పోషించాడు. హదస్సాకి ఎస్తేరు అనే పేరుకూడా వుంది. ఎస్తేరు అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను. మహారాజుయొక్క ఆజ్ఞ ప్రకటింపబడిన మీదట చాలామంది కన్యలు రాజధాని అయిన షూషను నగరానికి తరలింపబడ్డారు. వాళ్లందరూ హేగే నపుంసకుని అధీనంలో ఉంచబడ్డారు. ఆ యువతుల్లో ఎస్తేరు ఒకతె. ఎస్తేరును రాజభవనానికి తీసుకుపోయి, మిగిలిన అంతఃపుర స్త్రీలతో బాటు హేగే అధీనంలో ఉంచారు. ఎస్తేరు హేగేకి నచ్చింది. ఆమె అతనికి అభిమాన ప్రాత్రురాలైంది. దానితో హేగే ఆమెకి సౌందర్యవర్థక పక్రియను త్వరలో పూర్తిచేసి, ఆమెకి ప్రత్యేకమైన భోజన పదార్థాలను సమకూర్చాడు. అప్పుడిక హేగే ఎస్తేరుకీ, ఆమె ఏడుగురు పరిచారికలకీ అంతఃపుర స్త్రీలు నివసించే అతి శ్రేష్ఠమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేశాడు. తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు ఎవ్వరికీ చెప్పలేదు. మొర్దెకై వద్దన్నందున ఆమె తన కుటుంబ వివరాలేవీ ఎవ్వరికి తెలియ జెప్పలేదు. ఎస్తేరు ఎలాగుందో, ఆమె విషయంలో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకోసం మొర్దెకై ప్రతి రోజూ అంతఃపుర ఆవరణ ముందు అటు ఇటు తిరుగులాడు తుండేవాడు.

షేర్ చేయి
ఎస్తేరు 2 TERV

ఎస్తేరు 2:5-11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలిదండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళక్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను. మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురముయొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దకై తిరుగులాడు చుండెను.

షేర్ చేయి
ఎస్తేరు 2 TELUBSI