ఎస్తేరు 2:5-11

ఎస్తేరు 2:5-11 TSA

ఆ సమయంలో షూషను కోటలో బెన్యామీను గోత్రానికి చెందిన కీషుకు పుట్టిన షిమీ యొక్క కుమారుడైన యాయీరుకు పుట్టిన మొర్దెకై అనే యూదుడు ఉండేవాడు, బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నుండి చెరకు తీసుకెళ్లిన యూదా రాజైన యెహోయాకీనుతో పాటు ఉన్నవారిలో ఇతడు ఉన్నాడు. మొర్దెకై యొక్క పినతండ్రి యొక్క కుమార్తె, హదస్సా అనే బంధువు ఉన్నది, ఆమెకు తల్లిదండ్రులు లేనందుకు అతడే ఆమెను పెంచాడు. ఎస్తేరు అని కూడ పిలువబడే ఈ యువతి మంచి రూపం కలిగి, అందంగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై ఆమెను తన సొంత కుమార్తెగా దత్తత తీసుకున్నాడు. రాజు ఆజ్ఞ అంతా ప్రకటించబడింది, చాలామంది యువతులను, షూషను కోటకు తెచ్చారు, హేగై అనే ఆ అంతఃపురం యొక్క అధికారి ఆధీనంలో వారిని ఉంచారు, ఎస్తేరును కూడా రాజభవనానికి తీసుకెళ్లి హేగైకు అప్పగించారు. ఎస్తేరు అతనికి నచ్చింది, దయ పొందుకుంది. వెంటనే పరిమళద్రవ్యాలు ఆమెకు అందించి, ప్రత్యేక ఆహారం ఆమెకు ఏర్పాటు చేశాడు. అతడు ఆమె కోసం రాజభవనం నుండి ఏర్పరచబడిన ఏడుగురు స్త్రీ పరిచారకులను నియమించాడు, ఆమెను, ఆమె పరిచారకులను అంతఃపురంలోని శ్రేష్ఠమైన స్థలంలోనికి పంపించాడు. ఎస్తేరు తన జాతిని, తన కుటుంబ నేపధ్యాన్ని బయలుపరచలేదు, ఎందుకంటే అవి చెప్పకూడదని మొర్దెకై ఆమెకు ఆదేశించాడు. ఎస్తేరు ఎలా ఉందో, ఆమె క్షేమం తెలుసుకోవడానికి మొర్దెకై ప్రతిరోజు అంతఃపురం ఆవరణం దగ్గరే అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు.