ఎస్తేరు 2:5-11
ఎస్తేరు 2:5-11 IRVTEL
షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశికుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను బందీగా కొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చిన వాడు. అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారు పేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి. చూడ చక్కని ముఖవర్చస్సు గలది. ఆమె తలిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు. రాజ శాసనం, ఆజ్ఞ ప్రకటించడం అయిన తరువాత చాలామంది కన్యలను తెచ్చి షూషను కోటలో ఉంచారు. వారినందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వశంలో ఉంచారు. ఆ యువతి అంటే అతనికి చాలా ఇష్టం కలిగింది. అందువలన అతడు ఆమె పైన దయ చూపించాడు. అతడు ఆమెకు సౌందర్య సాధనాలను, భోజనపదార్ధాలను ఏర్పరచాడు. రాజుగారి దివాణంలో నుంచి ఏడుగురు ఆడపిల్లలను ఆమెకు చెలికత్తెలుగా ఏర్పాటు చేశాడు. ఆమెను, ఆమె చెలికత్తెలను రాణివాసంలో అతి శ్రేష్ఠమైన స్థలం లో ఉంచాడు. తన బంధువులెవరో తన జాతి ఏమిటో ఆమె ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అలా తెలపవద్దని మొర్దెకై ఆమెకు ఆజ్ఞాపించాడు. ఎస్తేరు యోగక్షేమాలు కనుక్కోవడానికీ ఆమెకేమి జరుగుతున్నదో తెలుసుకుంటూ ఉండడానికీ మొర్దెకై అంతఃపురం ఆవరణం బయట అనుదినం తిరుగులాడుతూ ఉండేవాడు.

