ఎస్తేరు 2:5-11

ఎస్తేరు 2:5-11 TERV

రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రి కీషు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను బందీగా పట్టుకొన్నాడు యెరూషలేము నుంచి చెరపట్టబడినవారిలో మొర్దెకై కూడా ఒకడు. హదస్సా అనే ఒక అమ్మాయి వుంది. ఆమె మొర్దెకైకి పినతండ్రి కూతురు. ఆమె తల్లితండ్రులు మరణించినప్పుడు, మొర్దకై ఆమెని చేరదీసి, తన స్వంత కూతురులా పెంచి పోషించాడు. హదస్సాకి ఎస్తేరు అనే పేరుకూడా వుంది. ఎస్తేరు అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను. మహారాజుయొక్క ఆజ్ఞ ప్రకటింపబడిన మీదట చాలామంది కన్యలు రాజధాని అయిన షూషను నగరానికి తరలింపబడ్డారు. వాళ్లందరూ హేగే నపుంసకుని అధీనంలో ఉంచబడ్డారు. ఆ యువతుల్లో ఎస్తేరు ఒకతె. ఎస్తేరును రాజభవనానికి తీసుకుపోయి, మిగిలిన అంతఃపుర స్త్రీలతో బాటు హేగే అధీనంలో ఉంచారు. ఎస్తేరు హేగేకి నచ్చింది. ఆమె అతనికి అభిమాన ప్రాత్రురాలైంది. దానితో హేగే ఆమెకి సౌందర్యవర్థక పక్రియను త్వరలో పూర్తిచేసి, ఆమెకి ప్రత్యేకమైన భోజన పదార్థాలను సమకూర్చాడు. అప్పుడిక హేగే ఎస్తేరుకీ, ఆమె ఏడుగురు పరిచారికలకీ అంతఃపుర స్త్రీలు నివసించే అతి శ్రేష్ఠమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేశాడు. తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు ఎవ్వరికీ చెప్పలేదు. మొర్దెకై వద్దన్నందున ఆమె తన కుటుంబ వివరాలేవీ ఎవ్వరికి తెలియ జెప్పలేదు. ఎస్తేరు ఎలాగుందో, ఆమె విషయంలో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకోసం మొర్దెకై ప్రతి రోజూ అంతఃపుర ఆవరణ ముందు అటు ఇటు తిరుగులాడు తుండేవాడు.