2 దినవృత్తాంతములు 33:11-16
2 దినవృత్తాంతములు 33:11-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు. బాధలో అతడు తన పూర్వికుల దేవుని ఎదుట తనను తాను చాలా తగ్గించుకుని తన దేవుడైన యెహోవాను దయచూపమని ప్రాధేయపడ్డాడు. అతడు ప్రార్థించినప్పుడు యెహోవా అతని విన్నపం ఆలకించి అతని ప్రార్థన అంగీకరించారు. అతడు యెరూషలేముకు అతని రాజ్యానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు యెహోవాయే దేవుడు అని మనష్షే తెలుసుకున్నాడు. ఇది జరిగిన తర్వాత మనష్షే లోయలోని గిహోను ఊటకు పడమరగా ఉన్న దావీదు నగర ప్రాకారాన్ని చేప ద్వారం వరకు, ఓఫెలు కొండ చుట్టూ కట్టించాడు. దానిని చాలా ఎత్తు చేయించాడు. యూదాలో కోటగోడలు గల ప్రతి పట్టణంలో అతడు సేనాధిపతులను నియమించాడు. అతడు యెహోవా మందిరంలో నుండి ఇతర దేవుళ్ళ విగ్రహాలను తొలగించాడు. యెరూషలేములో, యెహోవా మందిర కొండమీద తాను కట్టించిన బలిపీఠాలు తీసివేసి పట్టణం బయట వాటిని పారవేయించాడు. అప్పుడతడు యెహోవా బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించి, వాటి మీద సమాధానబలులు కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.
2 దినవృత్తాంతములు 33:11-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు. బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు. అతడు ప్రార్థన చేసినప్పుడు ఆయన అతని విన్నపాలు ఆలకించి యెరూషలేముకు, అతని రాజ్యానికి అతణ్ణి తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకున్నాడు. దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా, లోయలో చేప గుమ్మం వరకూ ఓపెలు చుట్టూ చాలా ఎత్తయిన గోడ కట్టించాడు. యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతులను ఉంచాడు. యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతా విగ్రహం తీసివేసి, యెరూషలేములో యెహోవా మందిరం ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు. అతడు యెహోవా బలిపీఠంను బాగుచేసి, దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.
2 దినవృత్తాంతములు 33:11-16 పవిత్ర బైబిల్ (TERV)
అందువల్ల అష్షూరు రాజు సైన్యాధికారులను యూదాపై దండెత్తటానికి యెహోవా రప్పించాడు. ఆ అధికారులు మనష్షేను పట్టుకుని, అతనికి సంకెళ్లు వేశారు. మనష్షే చేతులకు వారు ఇత్తడి గొలుసులు తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు పట్టుకుపోయారు. మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు మనష్షే దేవునికి ప్రార్థన చేసి, తనకు సహాయపడమని వేడుకున్నాడు. యెహోవా మనష్షే మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి తన సింహాసనాన్ని మళ్లీ అలకరించేలా చేసినాడు. యెహోవాయే నిజమైన దేవుడని మనష్షే అప్పుడు తెలిసికొన్నాడు. ఇది జరిగిన పిమ్మట మనష్షే దావీదు నగరానికి బయట ఒక గోడ కట్టించాడు. (కిద్రోను) లోయలో మత్స్యద్వారం ముంగిట నున్న గిహోను నీటి బుగ్గకు పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపెలు కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటలన్నిటిలో అతడు సైనికాధికారులను నియమించాడు. ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు. పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు.
2 దినవృత్తాంతములు 33:11-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను. ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మమువరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవామందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి, దానిమీద సమాధానబలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను.