2 దినవృత్తాంతములు 33:11-16
2 దినవృత్తాంతములు 33:11-16 TSA
అందువల్ల యెహోవా అష్షూరు రాజు సైన్యాధిపతులను వారి మీదికి రప్పించారు. వారు మనష్షేను బందీగా పట్టుకుని, అతని ముక్కుకు గాలం తగిలించి, ఇత్తడి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్లారు. బాధలో అతడు తన పూర్వికుల దేవుని ఎదుట తనను తాను చాలా తగ్గించుకుని తన దేవుడైన యెహోవాను దయచూపమని ప్రాధేయపడ్డాడు. అతడు ప్రార్థించినప్పుడు యెహోవా అతని విన్నపం ఆలకించి అతని ప్రార్థన అంగీకరించారు. అతడు యెరూషలేముకు అతని రాజ్యానికి తిరిగి వచ్చేలా చేశాడు. అప్పుడు యెహోవాయే దేవుడు అని మనష్షే తెలుసుకున్నాడు. ఇది జరిగిన తర్వాత మనష్షే లోయలోని గిహోను ఊటకు పడమరగా ఉన్న దావీదు నగర ప్రాకారాన్ని చేప ద్వారం వరకు, ఓఫెలు కొండ చుట్టూ కట్టించాడు. దానిని చాలా ఎత్తు చేయించాడు. యూదాలో కోటగోడలు గల ప్రతి పట్టణంలో అతడు సేనాధిపతులను నియమించాడు. అతడు యెహోవా మందిరంలో నుండి ఇతర దేవుళ్ళ విగ్రహాలను తొలగించాడు. యెరూషలేములో, యెహోవా మందిర కొండమీద తాను కట్టించిన బలిపీఠాలు తీసివేసి పట్టణం బయట వాటిని పారవేయించాడు. అప్పుడతడు యెహోవా బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించి, వాటి మీద సమాధానబలులు కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.

