2 దిన 33:11-16

2 దిన 33:11-16 IRVTEL

కాబట్టి యెహోవా అష్షూరురాజు సైన్యాధిపతులను వారిమీదికి రప్పించాడు. వారు మనష్షేను పట్టుకుని, గొలుసులతో బంధించి అతణ్ణి బబులోను తీసుకు వెళ్ళారు. బాధతో అతడు తన దేవుడైన యెహోవాను బతిమాలి, తన పూర్వీకుల దేవుని సన్నిధిలో తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు. అతడు ప్రార్థన చేసినప్పుడు ఆయన అతని విన్నపాలు ఆలకించి యెరూషలేముకు, అతని రాజ్యానికి అతణ్ణి తిరిగి తీసుకువచ్చాడు. అప్పుడు యెహోవాయే దేవుడని మనష్షే తెలుసుకున్నాడు. దీని తరువాత అతడు దావీదు పట్టణం బయట గిహోనుకు పడమరగా, లోయలో చేప గుమ్మం వరకూ ఓపెలు చుట్టూ చాలా ఎత్తయిన గోడ కట్టించాడు. యూదా దేశంలోని బలమైన పట్టణాలన్నిటిలో సేనాధిపతులను ఉంచాడు. యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతా విగ్రహం తీసివేసి, యెరూషలేములో యెహోవా మందిరం ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు. అతడు యెహోవా బలిపీఠంను బాగుచేసి, దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు.