2 దినవృత్తాంతములు 33:11-16
2 దినవృత్తాంతములు 33:11-16 TERV
అందువల్ల అష్షూరు రాజు సైన్యాధికారులను యూదాపై దండెత్తటానికి యెహోవా రప్పించాడు. ఆ అధికారులు మనష్షేను పట్టుకుని, అతనికి సంకెళ్లు వేశారు. మనష్షే చేతులకు వారు ఇత్తడి గొలుసులు తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు పట్టుకుపోయారు. మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు మనష్షే దేవునికి ప్రార్థన చేసి, తనకు సహాయపడమని వేడుకున్నాడు. యెహోవా మనష్షే మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి తన సింహాసనాన్ని మళ్లీ అలకరించేలా చేసినాడు. యెహోవాయే నిజమైన దేవుడని మనష్షే అప్పుడు తెలిసికొన్నాడు. ఇది జరిగిన పిమ్మట మనష్షే దావీదు నగరానికి బయట ఒక గోడ కట్టించాడు. (కిద్రోను) లోయలో మత్స్యద్వారం ముంగిట నున్న గిహోను నీటి బుగ్గకు పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపెలు కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటలన్నిటిలో అతడు సైనికాధికారులను నియమించాడు. ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు. పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు.

