ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకుంటూ పూర్ణ వినయంతో సాత్వికంతో, దీర్ఝశాంతంతో ఉండండి. మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి. శరీరం ఒక్కటే; ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీరు పిలువబడినప్పుడు ఒకే నిరీక్షణ కోసం పిలువబడ్డారు; ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే; అందరికి తండ్రియైన దేవుడు ఒక్కరే, ఆయనే అందరికి పైగా ఉన్నవారు, అందరి ద్వారా వ్యాపించి అందరిలో ఉన్నారు.
అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. అందుకే, ఈ విధంగా చెప్పబడింది:
“ఆయన ఆరోహణమైనప్పుడు,
ఆయన అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లి,
తన ప్రజలకు బహుమానాలను అనుగ్రహించారు.”
ఆయన ఆరోహణం అయ్యారంటే ఆయన క్రిందకు, భూమి మీదకు దిగివచ్చారని దాని అర్థం కాదా? క్రిందకు దిగివచ్చినవాడే, సమస్త ప్రపంచాన్ని నింపడానికి ఆకాశ మండలాలన్నింటి కంటే పైగా ఆరోహణమయ్యారు. మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడేలా తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు.
మనం ఇంకా పసిపిల్లలం కాదు కాబట్టి, మనుష్యులు మోసపూరిత యోచనలతో వంచనలతో కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతీ గాలికి ఇటు అటు ఎగిరిపోతూ, అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొనిపోయేవారంగా ఉండకూడదు. ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది.
కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వారు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి తమలో ఉన్న అజ్ఞానం కారణంగా దేవుని నుండి వచ్చే జీవం నుండి వేరుపరచబడి గ్రహించుటలో గ్రుడ్డివారిగా ఉన్నారు. వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు.
అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు. మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి, మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.