ఎఫెసీయులకు 4:2-24
ఎఫెసీయులకు 4:2-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకుంటూ పూర్ణ వినయంతో సాత్వికంతో, దీర్ఝశాంతంతో ఉండండి. మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోడానికి ప్రయాసపడండి. శరీరం ఒక్కటే; ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీరు పిలువబడినప్పుడు ఒకే నిరీక్షణ కోసం పిలువబడ్డారు; ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే; అందరికి తండ్రియైన దేవుడు ఒక్కరే, ఆయనే అందరికి పైగా ఉన్నవారు, అందరి ద్వారా వ్యాపించి అందరిలో ఉన్నారు. అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. అందుకే, ఈ విధంగా చెప్పబడింది: “ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లి, తన ప్రజలకు బహుమానాలను అనుగ్రహించారు.” ఆయన ఆరోహణం అయ్యారంటే ఆయన క్రిందకు, భూమి మీదకు దిగివచ్చారని దాని అర్థం కాదా? క్రిందకు దిగివచ్చినవాడే, సమస్త ప్రపంచాన్ని నింపడానికి ఆకాశ మండలాలన్నింటి కంటే పైగా ఆరోహణమయ్యారు. మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడేలా తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు. మనం ఇంకా పసిపిల్లలం కాదు కాబట్టి, మనుష్యులు మోసపూరిత యోచనలతో వంచనలతో కుయుక్తితో చేసే బోధలు అనే ప్రతీ గాలికి ఇటు అటు ఎగిరిపోతూ, అలలచే ముందుకు వెనుకకు కొట్టుకొనిపోయేవారంగా ఉండకూడదు. ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము. ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది. కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వారు తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి తమలో ఉన్న అజ్ఞానం కారణంగా దేవుని నుండి వచ్చే జీవం నుండి వేరుపరచబడి గ్రహించుటలో గ్రుడ్డివారిగా ఉన్నారు. వారు సిగ్గును వదిలి అత్యాశతో నానా విధాలైన అపవిత్ర కార్యాలను జరిగిస్తూ, తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు. మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి, మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి; నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.
ఎఫెసీయులకు 4:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు. అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి. దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు బందీలను చెరలోకి కొనిపోయాడనీ తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది. “ఆరోహణమయ్యాడు” అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్థం ఉంది కదా. అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు. విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు. అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.
ఎఫెసీయులకు 4:2-24 పవిత్ర బైబిల్ (TERV)
అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు. క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు. మానవులకు వరాలిచ్చాడు.” “ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు. అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది. ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.
ఎఫెసీయులకు 4:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోకూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. శరీర మొక్కటే, ఆత్మ యు ఒక్కడే; ఆప్రకారమే మీ పిలుపువిషయమైయొక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరముయొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది. ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైనవాడునై యున్నాడు. మనమందరము విశ్వాసవిష యములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభి వృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక, ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసునుగూర్చి విని, ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు. కావునమునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.