1 థెస్సలోనికయులకు 5:12-28

1 థెస్సలోనికయులకు 5:12-28 TSA

సహోదరీ సహోదరులారా, మీ మధ్యలో ప్రయాసపడుతున్నవారిని, ప్రభువులో మీ కోసం శ్రద్ధ చూపించేవారిని, మిమ్మల్ని హెచ్చరించేవారిని గౌరవించాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి. ఎల్లప్పుడు ఆనందించండి; విడువక ప్రార్థించండి, మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము. ఆత్మ ప్రేరణను ఆర్పకండి. ప్రవచనాలను తిరస్కరించకండి. అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి, ప్రతీ కీడును తిరస్కరించండి. సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు. సహోదరీ సహోదరులారా, మాకోసం ప్రార్థించండి. దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు. సహోదరీ సహోదరులందరికి ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీతో ఉండును గాక.