1 థెస్సలొనీకయులకు 5:12-28

1 థెస్సలొనీకయులకు 5:12-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సహోదరీ సహోదరులారా, మీ మధ్యలో ప్రయాసపడుతున్నవారిని, ప్రభువులో మీ కోసం శ్రద్ధ చూపించేవారిని, మిమ్మల్ని హెచ్చరించేవారిని గౌరవించాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి. ఎల్లప్పుడు ఆనందించండి; విడువక ప్రార్థించండి, మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము. ఆత్మ ప్రేరణను ఆర్పకండి. ప్రవచనాలను తిరస్కరించకండి. అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి, ప్రతీ కీడును తిరస్కరించండి. సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు. సహోదరీ సహోదరులారా, మాకోసం ప్రార్థించండి. దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు. సహోదరీ సహోదరులందరికి ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీతో ఉండును గాక.

1 థెస్సలొనీకయులకు 5:12-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి. వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి. సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి. ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం. దేవుని ఆత్మను ఆర్పవద్దు. ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి. ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి. శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక! మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు. సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి. పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి. సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక!

1 థెస్సలొనీకయులకు 5:12-28 పవిత్ర బైబిల్ (TERV)

సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, కష్టపడి పని చేస్తూ ప్రభువు సేవలో మీకు దారి చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి. వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను అందరికన్నా ఎక్కువగా ప్రేమించి గౌరవించండి. శాంతంగా జీవించండి. సోదరులారా! సోమరులను వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్చండి. ఇది మా విజ్ఞాపన. కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి. ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి. దైవ నియమాన్ని తప్పక పాటించండి. అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక. ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్పివేయకండి. ప్రవక్తలు చెప్పినవాటిని తూలనాడకండి. అన్నిటినీ పరీక్షించండి. మంచిని విడువకండి. చెడుకు దూరంగా ఉండండి. శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చెయ్యనీయండి. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేరోజు, మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి లేకుండా ఉండుగాక! మిమ్మల్ని పిలిచేవాడు విశ్వసింపదగ్గవాడు. ఆయన మేము కోరింది తప్పక చేస్తాడు. సోదరులారా! మా కోసం ప్రార్థించండి. సోదరులందరినీ ప్రేమతో హృదయాలకు హత్తుకోండి. ప్రభువు సమక్షంలో ఈ లేఖను సోదరులందరికీ చదివి వినిపించమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. మన యేసు ప్రభువు అనుగ్రహం మీపై ఉండుగాక!

1 థెస్సలొనీకయులకు 5:12-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధిచెప్పు వారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా –అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును. సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి. పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి. సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను. మన ప్రభువైనయేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

1 థెస్సలొనీకయులకు 5:12-28

1 థెస్సలొనీకయులకు 5:12-28 TELUBSI