అపొస్తలుల 17
17
థెస్సలొనీకలో
1వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. 2అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. 3క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. 4తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.
5ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. 6వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. 7వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.
8ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. 9ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.
బెరయలో
10అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు. 11థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయవాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథం చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. 12చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.
13పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు. 14వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు. 15పౌలుతో వెళ్ళినవాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.
ఏథెన్సులో
16పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ దుఃఖించింది. 17అందువల్ల సమాజమందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవభీతిగల యూదులుకాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు. 18ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు.
“ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.
19వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధ ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు. 20“నీవు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసావు. వాటి అర్థం మాకు చెప్పు” అని మరి కొందరడిగారు. 21ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపేవాళ్ళు. మరే పని చేసేవాళ్ళు కాదు.
22పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్ఠగా ఉన్నారు. ఇది నేను గమనించాను. 23నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.
24“ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు, ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు. 25మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతి వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 26ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.
27“మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు. 28‘మనం ఆయనలో జీవిస్తున్నాం, ఆయనలో కదులుతున్నాం, ఆయన కారణంగా మనం ఉన్నాం.’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’
29“మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని, లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటివాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడు కాడు. 30గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ఉండినాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారుమనస్సు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 31ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించి, తాను చేయనున్నదాన్ని ప్రజలందరికీ రుజువు చేసాడు.”
32చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు. 33పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు. 34కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసి అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగువాళ్ళున్నారు.
Выбрано:
అపొస్తలుల 17: TERV
Выделить
Копировать
Сравнить
Поделиться
Хотите, чтобы то, что вы выделили, сохранялось на всех ваших устройствах? Зарегистрируйтесь или авторизуйтесь
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International