యోహాను సువార్త 10
10
మంచి గొర్రెల కాపరి, ఆయన గొర్రెలు
1“గొర్రెల దొడ్డిలోనికి వెళ్లే ద్వారం నుండి కాక వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగ దోచుకునేవాడని నేను మీతో చెప్పేది నిజము. 2గొర్రెల దొడ్డిలోనికి ద్వారం గుండా వచ్చేవాడు గొర్రెల కాపరి. 3కావలివాడు కాపరికి తలుపు తీస్తాడు. ఆ గొర్రెలు తమ కాపరి స్వరాన్ని వింటాయి. ఆ కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి, వాటిని బయటకు నడిపిస్తాడు. 4అతడు తన సొంత గొర్రెలను బయటకు తీసుకువచ్చినప్పుడు వాటికి ముందుగా నడుస్తాడు, ఆ గొర్రెలకు అతని స్వరం తెలుసు కాబట్టి అవి అతన్ని వెంబడిస్తాయి. 5అయితే క్రొత్తవారి స్వరాన్ని అవి గుర్తించవు కాబట్టి వారిని వెంబడించవు; నిజానికి, అవి వారి నుండి పారిపోతాయి” అని చెప్పారు. 6ఈ సాదృశ్యం ద్వారా యేసు చెప్పిన విషయాన్ని పరిసయ్యులు గ్రహించలేకపోయారు.
7కాబట్టి యేసు మళ్ళీ వారితో, “నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, గొర్రెలకు ద్వారం నేనే అని మీతో చెప్పేది నిజం. 8నాకన్నా ముందు వచ్చిన వారందరు దొంగలు దోచుకునేవారే. కాబట్టి గొర్రెలు వారి మాటలు వినలేదు. 9నేనే ద్వారాన్ని; నా ద్వారా లోపలికి ప్రవేశించేవారు రక్షింపబడతారు.#10:9 లేదా సురక్షితంగా ఉంచబడతారు వారు లోపలికి వస్తూ బయటకు వెళ్తూ పచ్చికను కనుగొంటారు. 10దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి వస్తాడు. అయితే నేను గొర్రెలకు జీవం కలిగించాలని, అది సమృద్ధిగా కలిగించాలని వచ్చాను.
11“నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలను కాపాడడానికి తన ప్రాణానికి తెగిస్తాడు. 12జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఆ గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది. 13జీతగాడు జీతం కొరకే పని చేస్తాడు కాబట్టి గొర్రెల గురించి పట్టించుకోకుండా పారిపోతాడు.
14-15“నేను మంచి కాపరిని; నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు; అలాగే నాకు నా గొర్రెలు తెలుసు నా గొర్రెలకు నేను తెలుసు. నా గొర్రెల కోసం నేను నా ప్రాణం పెడతాను. 16ఈ దొడ్డివికాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడ నేను తోడుకొని రావాలి. అవి కూడా నా స్వరం వింటాయి, అప్పుడు ఒక్క మంద ఒక్క కాపరి ఉంటాడు. 17నేను నా ప్రాణాన్ని మళ్ళీ పొందడానికే దాన్ని పెడుతున్నాను, కాబట్టి నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు. 18నా దగ్గర నుండి ఎవరు దానిని తీసుకోలేరు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను” అని చెప్పారు.
19ఈ మాటల వలన యూదులలో మరల భేదాలు ఏర్పడ్డాయి. 20వారిలో అనేకమంది, “ఇతడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఇతనికి దయ్యం పట్టింది. ఇతని మాటలను ఎందుకు వింటున్నారు?” అన్నారు.
21కానీ మరికొందరు, “ఇవి దయ్యం పట్టినవాని మాటలు కాదు, ఒక దయ్యం గ్రుడ్డివాడికి చూపు ఇవ్వగలదా?” అని అడిగారు.
యూదులచేత తృణీకరించబడిన యేసు
22ఆ తర్వాత యెరూషలేములో ప్రతిష్ఠిత పండుగ సమీపించింది. అది శీతాకాలము. 23యేసు దేవాలయ ఆవరణంలో సొలొమోను మండపంలో నడుస్తున్నారు. 24అప్పుడు యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో, “ఇంకా ఎంతకాలం నీవు మమ్మల్ని సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు.
25అందుకు యేసు వారితో, “నేను మీకు చెప్పాను కాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేసిన అద్భుతకార్యాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 26కాని మీరు నా గొర్రెలు కారు కాబట్టి మీరు నమ్మరు. 27నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి; అవి నాకు తెలుసు అవి నన్ను వెంబడిస్తాయి. 28నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తాను, కాబట్టి అవి ఎన్నడు నశించవు; వాటిని నా చేతిలో నుండి ఎవరు దొంగిలించలేరు. 29వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు; నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవరు దొంగిలించలేరు. 30నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.
31ఆయనకు విరోధంగా ఉన్న యూదులు మళ్ళీ ఆయనను కొట్టాలని రాళ్లను పట్టుకున్నారు. 32అయితే యేసు వారితో, “నా తండ్రి నుండి మీకు అనేక మంచి కార్యాలను చూపించాను. వాటిలో దేన్ని బట్టి నన్ను రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారా?” అని అడిగారు.
33“అందుకు యూదులు, నీవు చేసిన మంచిపనుల బట్టి కాదు. నీవు మానవుడవై ఉండి దేవుడనని చెప్పుకుంటూ దైవదూషణ చేస్తున్నందుకు” అని అన్నారు.
34యేసు వారితో, “ ‘మీరు “దేవుళ్ళు” అని నేను అన్నాను’#10:34 కీర్తన 82:6 అని మీ లేఖనాల్లో వ్రాసిలేదా? 35దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టివేయడానికి లేదు; దేవుని వాక్యాన్ని పొందుకొనిన వారినే ఆయన ‘దేవుళ్ళు’ అని పిలిచినప్పుడు, 36తండ్రి తన సొంతవానిగా ప్రత్యేకపరచుకుని లోకానికి పంపినవాని సంగతేమిటి? ‘నేను దేవుని కుమారుడను’ అని చెప్పినందుకు దైవదూషణ అని నాపైన నేరం ఎందుకు మోపుతున్నారు? 37నేను నా తండ్రి పనులను చేయకపోతే నన్ను నమ్మకండి. 38అయితే నేను వాటిని చేస్తే మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలో ఉన్నాడని నేను తండ్రిలో ఉన్నానని మీరు తెలుసుకుని గ్రహించేలా, నేను చేసే క్రియలను నమ్మండి” అని చెప్పారు. 39వారు ఆయనను పట్టుకోవాలని మరల ప్రయత్నించారు, కానీ ఆయన వారి నుండి తప్పించుకున్నారు.
40తర్వాత యేసు యొర్దాను నదిని దాటి, యోహాను మొదట బాప్తిస్మమిస్తూ ఉండిన ప్రాంతానికి తిరిగివచ్చి అక్కడ ఉన్నారు. 41చాలామంది ఆయన దగ్గరకు వచ్చి, “యోహాను ఏ అద్భుత కార్యాన్ని చేయలేదు కాని ఈయన గురించి యోహాను చెప్పినవి అన్ని సత్యమే” అన్నారు. 42ఆ స్థలంలో చాలామంది యేసును నమ్మారు.
Obecnie wybrane:
యోహాను సువార్త 10: TSA
Podkreślenie
Kopiuj
Porównaj
Udostępnij
Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.