నిర్గమ 36
36
1పరిశుద్ధాలయం యొక్క సేవ కోసం చేయవలసిన అన్ని రకాల పనులు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యెహోవా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చిన బెసలేలు ఒహోలీయాబు వలె నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం పని చేయాలి” అన్నాడు.
2తర్వాత బెసలేలును ఒహోలీయాబును, యెహోవా సామర్థ్యం ఇచ్చిన వారిని, పని చేయడానికి ప్రేరేపించబడిన వారందరిని మోషే పిలిపించాడు. 3పరిశుద్ధాలయ నిర్మాణానికి ఇశ్రాయేలీయులు తెచ్చిన కానుకలన్నిటిని మోషే దగ్గర నుండి వారు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ప్రతి ఉదయం స్వేచ్ఛార్పణగా అతని దగ్గరకు కానుకలు తెస్తూనే ఉన్నారు. 4కాబట్టి పరిశుద్ధాలయం యొక్క పనులన్నిటిని చేస్తున్న నైపుణ్యంగల పనివారంతా తాము చేస్తున్న పని విడిచి వచ్చి, 5మోషేతో, “యెహోవా చేయమని ఆజ్ఞాపించిన పనికి కావలసిన దానికన్నా ఎక్కువగా ప్రజలు తెస్తున్నారు” అని చెప్పారు.
6అప్పుడు మోషే: “పరిశుద్ధాలయం కోసం ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఇకమీదట ఏ అర్పణ తీసుకురాకూడదు” అని ఒక ఆజ్ఞ ఇవ్వగా వారు దాన్ని శిబిరమంతటికి తెలియజేశారు. అప్పుడు ప్రజలు కానుకలు తీసుకురావడం మానుకున్నారు. 7ఎందుకంటే, వారు తెచ్చిన కానుకలు ఆ పని అంతా పూర్తి చేయడానికి కావలసిన దానికన్నా ఎక్కువ.
సమావేశ గుడారం
8ఆ పనివారిలో నిపుణులైన వారందరు పది తెరలతో సమావేశ గుడారాన్ని తయారుచేశారు; వాటిని నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో చేసి వాటిపై చేయితిరిగిన పనివానితో కెరూబులను అల్లించారు. 9తెరలన్నీ ఇరవై ఎనిమిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.#36:9 అంటే, సుమారు 13 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పు 10వారు అయిదు తెరలను ఒక దానితో ఒకటి కలిపి ఒక్కటిగా చేశారు; మిగిలిన అయిదింటిని కూడా అలాగే చేశారు. 11తర్వాత వారు ఒక కూర్పులోని తెరల చివర మొదటి తెర అంచుకు నీలి నూలుతో ఉచ్చులు చేశారు, రెండవ కూర్పులోని బయటి తెర చివర కూడా అలాగే చేశారు. 12అంతేకాక వారు ఒక తెరకు యాభై ఉచ్చులు చేసి, ఉచ్చులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా మరొకదాని తెర అంచుకు యాభై ఉచ్చులు చేశారు. 13తర్వాత వారు యాభై బంగారు గుండీలు తయారుచేసి ఆ గుండీలతో ఆ రెండు తెరలను ఒక దానితో ఒకటి కలిపినప్పుడు అది ఒకే సమావేశ గుడారంగా ఉంటుంది.
14వారు సమావేశ గుడారం పైకప్పుగా ఉండే గుడారం కోసం మేక వెంట్రుకలతో మొత్తం పదకొండు తెరలు తయారుచేశారు. 15పదకొండు తెరలన్నీ పొడవు ముప్పై మూరలు, వెడల్పు నాలుగు మూరలు కలిగి ఒకే కొలతతో ఉన్నాయి.#36:15 అంటే, సుమారు 14 మీటర్ల పొడవు, 1.8 మీటర్ల వెడల్పు 16వారు అయిదు తెరలను ఒకటిగా మిగతా ఆరు తెరలను ఒకటిగా కలిపారు. 17అప్పుడు వారు మొదటి కూర్పులోని చివరి తెర అంచున, అలాగే రెండవ కూర్పులోని చివరి తెర అంచున యాభై ఉచ్చులు చేశారు. 18దాన్ని ఒకటే గుడారమయ్యేలా వారు యాభై ఇత్తడి గుండీలు తయారుచేశారు. 19ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల చర్మంతో గుడారం కోసం పైకప్పును దానిపైన మన్నికైన తోళ్లతో పైకప్పు తయారుచేశారు.
20వారు సమావేశ గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలు తయారుచేశారు. 21ప్రతి చట్రం పొడవు పది మూరలు, వెడల్పు ఒకటిన్నర మూర ఉన్నాయి,#36:21 అంటే, సుమారు 4.5 మీటర్ల పొడవు, 70 సెం.మీ. వెడల్పు 22రెండు కొయ్యమేకులు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చారు. వారు సమావేశ గుడారపు చట్రాలన్నిటిని ఈ విధంగా తయారుచేశారు. 23సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు. 24ప్రతి చట్రానికి క్రింద రెండు కొయ్య మేకులకు రెండు దిమ్మల చొప్పున ఇరవై చట్రాలకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు. 25మరోవైపుకు, అంటే సమావేశ గుడారానికి ఉత్తర వైపుకు, ప్రతి చట్రం క్రింద రెండు చొప్పున, వారు ఇరవై చట్రాలు తయారుచేశారు. 26వాటి క్రిందకు నలభై వెండి దిమ్మలు తయారుచేశారు. 27పడమర వైపుకు అంటే సమావేశ గుడారపు వెనుక వైపుకు వారు ఆరు చట్రాలు తయారుచేశారు, 28సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి. 29ఈ రెండు మూలల వద్ద చట్రాలు క్రింది నుండి పై వరకు రెండింతలు ఉండి ఒకే ఉంగరంలోకి అమర్చబడ్డాయి; రెండూ ఒకేలా ఉన్నాయి. 30అక్కడ ఎనిమిది చట్రాలు, ప్రతి చట్రం క్రింద రెండేసి చొప్పున పదహారు వెండి దిమ్మలు ఉన్నాయి.
31అలాగే వారు తుమ్మకర్రతో అడ్డకర్రలు తయారుచేశారు: సమావేశ గుడారానికి ఒక ప్రక్కన ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు, 32రెండవ వైపున ఉన్నవాటికి అయిదు, సమావేశ గుడారానికి వెనుక వైపున పడమర వైపున ఉన్న చట్రాలకు అయిదు అడ్డకర్రలు చేశారు. 33చట్రాల మధ్యలో ఉండే అడ్డకర్రను ఈ చివరి నుండి ఆ చివరి వరకు చేశారు. 34వారు చట్రాలను బంగారంతో పొదిగించి, అడ్డకర్రలు ఉంచడానికి బంగారు ఉంగరాలు చేశారు. అలాగే అడ్డకర్రలను కూడా బంగారంతో పొదిగించారు.
35వారు నీలం ఊదా ఎరుపు రంగుల్లో ఒక తెరను పేనిన సన్నని నారతో చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించారు. 36వారు దాని కోసం తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాలు చేసి బంగారంతో పొదిగించారు. వాటికి బంగారు కొక్కేలు చేసి, వాటికి నాలుగు వెండి దిమ్మలు వేశారు. 37గుడారపు ప్రవేశ ద్వారానికి వారు నీలం ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పని చేసిన తెర తయారుచేశారు. 38వారు వాటికోసం అయిదు స్తంభాలు అలాగే కొక్కేలు చేశారు. వారు స్తంభాల పైభాగాలను, వాటి పట్టీలను బంగారంతో పొదిగించారు, అలాగే వాటికోసం అయిదు ఇత్తడి దిమ్మలు చేశారు.
Terpilih Sekarang Ini:
నిర్గమ 36: TSA
Highlight
Salin
Bandingkan
Kongsi
Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.